తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి పండుగ సీజన్ ఎంతో కీలకంగా భావిస్తారు. పండుగ కాకపోయినా ఆగష్టు 15న పబ్లిక్ హాలిడే కాబట్టి ఆరోజు రిలీజ్ లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ, మొదటి వారంలోనే ఈ చిత్రాలు భారీ నిరాశకు గురి చేసాయి.
‘డబుల్ ఇస్మార్ట్’ మొదటి రోజున సీక్వెల్ క్రేజ్ కొంత ఉపయోగించుకుని ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే, ఆ తరువాతి రోజుల్లో ఈ సినిమా వసూళ్లలో డీలా కనిపించింది. ఇక రవి తేజ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. రవితేజ కెరీర్లో ఈ సినిమా ‘డిజాస్టర్’గా పేరొందుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా వసూళ్లు రోజురోజుకి తగ్గిపోతుండడం వల్ల, మొత్తం వసూళ్లలో భారీ లోటు సంభవించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతిమంగా, ‘మిస్టర్ బచ్చన్’ ప్రపంచవ్యాప్తంగా సింగిల్ డిజిట్ కలెక్షన్లతో ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ చిత్రం రవితేజ కెరీర్లో ‘బిగ్గెస్ట్ డిజాస్టర్’గా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలపై వస్తున్న విమర్శలు నష్టాలు అటు బయ్యర్లను ఇటు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ పరిస్థితులు పరిశ్రమలో మరిన్ని చర్చలు మొదలుపెట్టాయి. చిన్న సినిమాలుగా విడుదలైన గీతా ఆర్ట్స్ ఆయ్, నిహారిక కొణిదెల నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమాలు మాత్రం లాభాల బాట పట్టాయి