Terrorists Arrested: బెంగళూరు(Bangalore)లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(CCB) అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. వారి నుంచి మొబైల్ ఫోన్లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు సీసీబీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ న నిర్వహించినట్లు తెలుస్తోంది. వారిని లోతుగా విచారిస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అనుమానిస్తున్నారు.
అరెస్టయిన ఐదుగురు నిందితులకు 2017లో జరిగిన ఓ హత్యకేసులో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఆ హత్య కేసులో బెంగుళూరు సెంట్రల్ జైలుకి వెళ్లిన ఐదుగురికి అక్కడ కొంత మంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, తరువాత వారు ఉగ్రదాడులకు శిక్షణ పొందారని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, వారికి సంబంధించిన ప్రణాళికలు, వారి సమాచారం ఈ ఐదుగురికి తెలుసని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలో ఉగ్ర దాడులకు సంబంధించిన విషయం ఇంటెలిజెన్స్ ద్వారా సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు(police) తెలిపారు. సీసీబీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం జరిపిన ఆపరేషన్‌లో 7 పిస్టల్స్, 42 లైవ్ బుల్లెట్లు, 2 శాటిలైట్ ఫోన్ టైవ్ వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, వివిధ కంపెనీల సిమ్‌లు, ల్యాప్‌టాప్ లభ్యమైనాయని పోలీసు అధికారులు అంటున్నారు.