సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.
డ్రగ్స్ కేసు(Drugs Case)లో కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి(Kp Chaudhary)ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను కేపీ చౌదరి బయటపెట్టారు. సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు తాను కొకైన్ సరఫరా చేస్తున్నట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నారు. డ్రగ్స్ కొన్న వారి జాబితా, ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీ ఫోటోలను కేపీ చౌదరి తన గూగుల్ డ్రైవ్‌లో భద్రపర్చుకున్నారు. ఆ ఆధారాలను పోలీసులు వెలికితీయడంతో వాటితో సంబంధం ఉన్న సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులిచ్చారు.
జూన్ 14వ తేదిన కేపీ చౌదరి(Kp Chaudhary) గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్‌ను తీసుకొచ్చారు. అందులో 12 గ్రాముల కొకైన్ విక్రయించాడు. మిగిలిన 88 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 12 గ్రాములను ఎవరికి అమ్మాడనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు.
కస్టడీలో కేపీ చౌదరి(Kp Chaudhary) సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. సినీ ప్రముఖులకు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించాడని, తాను డ్రగ్స్ సరఫరా చేసిన వారిలో బెజవాడ భరత్, తేజ, రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగూర్ ప్రసాద్, శ్వేత వంటివారు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో అషురెడ్డి స్పందించింది. తాను అద్దె ఇంటి కోసం కేపీ చౌదరిని సంప్రదించానని, అంతే తప్పా తనకు డ్రగ్స్ కేసు(Drugs Case)లో ఏ సంబంధం లేదని తెలిపారు.