జగన్ రోడ్డు మీదే తిరిగడం మానేశారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేశారు. జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ లోనే వెళ్తున్నారని మండిపడ్డారు.
ఇంతకీ మ్యాటరేంటంటే…గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ నిన్న పర్యటించారు. రైతు భరోసా పథకం నిధుల పంపిణీ కోసం జగన్ తెనాలి వెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేసిన హంగామా విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిపివేత, రోడ్లపై ఆంక్షలు, తాడేపల్లి నుంచి తెనాలికి సీఎం జగన్ హెలికాఫ్టర్ ప్రయాణం కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగన్ రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని సెటైర్లు పేల్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏంటి.. జనం నవ్వుకొంటున్నారని అన్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోందని.. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగుపడతాయని అన్నారు. రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అలాగే జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం హేయమైన చర్య అని అన్నారు.