తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) గత కొంతకాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన ఫోన్ ను ట్యాపింగ్ (phone tapping) చేశారని ఆరోపిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జగన్ను (YS Jagan) తాను ఎంతగానో నమ్మానని, కానీ తనను ఆయన అనుమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆయన సొంత పార్టీ పైన, ప్రభుత్వం పైన, నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు కోటంరెడ్డి. తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. శుక్రవారం కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నిరసన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. నెల్లూరు రూరల్ లో మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ. 13 కోట్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. కానీ ఆర్థిక శాఖ ఆ నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగు దేశం పార్టీ హయాంలో మొదలైందని గుర్తు చేశారు. తాను కూడా పూర్తి చేయలేకపోయానన్నారు. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలోను కోటంరెడ్డి పలు అంశాలపై స్పందించారు. బిల్లులు, అభివృద్ధి అంశాల గురించి మీరు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన అనంతరం జగన్ మిమ్మల్ని పిలిపించి పరుషంగా మాట్లాడినట్లుగా ప్రచారం సాగుతోందని అడిగారు. దీనిపై కోటంరెడ్డి స్పందిస్తూ… తనను జగన్ హెచ్చరించినట్లుగా అక్కడే ఉన్న వైసీపీ నేతలతో చెప్పించాలని సూచించారు. తన పట్ల ఎవరైనా పరుషంగా మాట్లాడితే… ఆ మాటల్లో వాస్తవం ఉంటే తాను కచ్చితంగా భరిస్తానని చెప్పారు. కానీ ఆ మాటల్లో వాస్తవం లేకుండానే పరుషంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. ఒకవేళ జగన్ ముందు తన అగ్రహాన్ని లేదా ఆవేదనను వెళ్లగక్కక పోయినప్పటికీ… ఆయన వద్ద నుండి బయటకు వచ్చాక అయినా… మీడియా ముందుకు వచ్చి.. తనను ముఖ్యమంత్రి దుర్భాషాలు ఆడారు, పరుషంగా మాట్లాడారు అని చెబుతాను కదా అన్నారు. తాను అభిమానించే నాయకుడు అయినప్పటికీ తన తప్పు లేకుండా జగన్ పరుషంగా మాట్లాడితే ఊరుకునే వ్యక్తిని కాదన్నారు. తాను ఏమైనా ఇసుక అక్రమంగా తరలిస్తున్నానా.. మరేదైనా చేస్తున్నానా అని ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి తన గురించి లీకులు ఇప్పించారని, తన అవినీతి చిట్టా వైసీపీ వద్ద ఉంటే ప్రభుత్వం వారిదే కాబట్టి విచారణ జరిపించాలని సవాల్ చేశారు. సజ్జల వంటి వ్యక్తుల వల్ల తనలాంటి వారికి, జగన్ కు మధ్య విబేధాలు పెరుగుతున్నాయని చెప్పారు. జగన్ ను అభిమానించే వారు కూడా దూరం జరిగే పరిస్థితి వస్తోందన్నారు. ఆ రోజు తనతో జగన్ ఆగ్రహంతో మాట్లాడలేదన్నారు. ఆ రోజు తన సమస్య ఏమిటని అధినేత అడిగారని, అప్పుడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు చెప్పినట్లు తెలిపారు. తన సమస్యలు విని.. త్వరగా వాటిని పరిష్కరించాలని జగన్… ధనుంజయ రెడ్డికి చెప్పారని తెలిపారు. తాను జనవరి 2న కలిశానని, నెల రోజులు దాటినా ఇప్పటి వరకు వాటిని పరిష్కరించలేదన్నారు.