అదృష్టం తలుపు కొడితే ఎలా ఉంటుందో తెలీదు కానీ.. దరిధ్రం తలుపుకొడితే మాత్రం.. ఇదిగో ఈ వ్యక్తి జీవితంలా మారుతుందేమో. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఒక వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీ పాక్స్, ఎయిడ్స్ అన్నీ కలిసి ఒకేసారి ఎటాక్ చేశాయి. ఈ దారుణ సంఘటన ఇటలీలో చోటుచేసుకోగా… అతని సంగతేంటో ఓసారి చూద్దాం…
ఇటలీకి చెందిన 36ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీ పాక్స్, హెచ్ఐవీ సోకాయి. సదరు వ్యక్తి ఇటీవల స్పెయిన్ పర్యటనకు వెళ్లి వచ్చాడు. అక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి అతనికి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలు ఉన్నాయని పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత ఒంటిపై దద్దుర్లు రావడం మొదలయ్యాయి.
మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో అతను వెంటనే వైద్యులను సంప్రదిచాడు. అక్కడ వైద్యులు అతనికీ పలు రకాల పరీక్షలు నిర్వహించగా… మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత.. చేసిన మరికొన్ని పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ గా కూడా రావడం గమనార్హం. జీనోమ్ సీక్వెన్స్ లో అతను ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 5.1 బారినపడినట్లు గుర్తించారు. అతనికి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. మళ్లీ సోకడం గమనార్హం.
అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందట. కరోనా, మంకీ పాక్స్ నుంచి కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని సమాచారం.