హెచ్ఐవీ ప్రమాదకరమైనదని, దీనికి చికిత్స లేదనే విషయం తెలిసిందే. అయితే హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వకూడదనే నిషేధం అమెరికాలో ఉంది. మరి హెచ్ఐవీ ఉన్న తల్లులు పిల్లలకు పాలివ్వచ్చా? లేదా? తెలుసుకుందాం.
HIV: హెచ్ఐవీ ప్రమాదకరమైనదని, దీనికి చికిత్స లేదనే విషయం తెలిసిందే. అయితే హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వకూడదనే నిషేధాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎత్తివేసింది. ఇకపై హెచ్ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వచ్చు. ప్రస్తుతం ఎయిడ్స్‌తో బాధపడేవారికి నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. హెచ్ఐవీ తల్లులు వాడే మందుల ద్వారా బిడ్డకు వైరస్ సోకే ముప్పును ఒకశాతంలోపుకి పరిమితం చేయవచ్చని కొలరాడో యూనివర్సిటీ తెలిపింది. హెచ్ఐవీని అదుపులో ఉంచే చికిత్సా విధానం పదేళ్ల నుంచి విస్తృతమైంది.
పదేళ్లకుముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే ముప్పు 30 శాతంగా ఉండేది. కానీ ప్రస్తుతం అది ఒక శాతం ఉంది. 1990 మొదట్లో అమెరికాలో ప్రతి ఏడాది 2 వేలమంది చిన్నారులు హెచ్ఐవీ బారినపడేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లోపే ఉంది. అమెరికాలో హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదువేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు. హెచ్ఐవీ తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వవద్దంటూ వైరస్ వెలుగు చూసి తొలినాళ్లలో అంటే 1980లలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతిపాదించింది. ఇప్పుడు చికిత్సా విధానాలు పెరగడం, హెచ్ఐవీ సంక్రమణను అదుపులో ఉంచే మెరుగైన మందులు అందుబాటులోకి రావడంతో ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.