కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.
ఐపీఎల్ (IPL)లో అత్యధిక ప్రేక్షకాభిమానం కలిగిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (Royal Challengers Bangalore – RCB). ఆ జట్టుకు ఒక్క ట్రోఫీ తప్ప దక్కలేదనే అసంతృప్తి తప్ప మ్యాచ్ లు, రికార్డులు లెక్కలేనన్నవి ఆ జట్టు సొంతం. జట్టులో పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉంటే చాలు ఇక పండుగే. అలాంటి ఆర్సీబీ అభిమానులు ఆదివారం మరింత పండుగ చేసుకున్నారు. తొలి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ (Mumbai Indians- MI)ను బెంబేలెత్తించారు. ముంబై బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. కోహ్లీ బ్యాటింగ్ (Batting) అయితే అభిమాన లోకాన్ని ఉర్రూతలూగించింది. డుప్లెసిస్ (DuPlessis), కోహ్లీ కలిసి ఊచకోత కోయగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League- IPL)లో ఆర్సీబీ తొలి విజయాన్ని అందుకుంది. ముంబైని 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals- RR) చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad- SRH) జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఆ మ్యాచ్ అంత మజా ఇవ్వలేదు. కానీ ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన రెండో మ్యాచ్ మాత్రం కెవ్వు కేక అనిపించింది. చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy Stadium) ఆదివారం రాత్రి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. జట్టు వంద కూడా స్కోర్ నమోదు చేయదని అనుకున్న సమయంలో మన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Verma) (84 నాటౌట్: 46 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్ లు) భారీ పరుగులు రాబట్టాడు. కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్ (Innings) ఆడాడు. ఇక సునాయస లక్ష్యాన్ని ఓపెనర్లుగా దిగిన కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డుప్లెసిస్ (73: 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోయారు. బ్యాట్ తో పరుగుల వర్షం కురిపించారు. 22 బంతులు మిగిలి ఉండగానే ముంబైని 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడించింది.
అతికష్టంగా ముంబై
మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై అతి కష్టంగా పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ (Ishan Kishan) పది పరుగులకే ఔటైపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. 10 బంతులు ఆడి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) ఉన్నాడు అనుకుంటే అతడు 15 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. రూ.17.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ (Cameroon Green) కేవలం 5 పరుగులే చేశాడు. దీంతో ముంబై పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి స్కోర్ 29 చేసింది. 10 ఓవర్లకు 52/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తీవ్ర ఒత్తిడి సమయంలో బ్యాట్ అందుకున్న మన హైదరాబాద్ పోరడు తిలక్ వర్మ ఆచూతూచి ఆడుతూ స్కోర్ బోర్డును (Score Board) పరుగులు పెట్టించాడు. వంద కూడా స్కోర్ దాటదని అనుకోగా.. అంచనాలను మించి ఏకంగా 172 పరుగుల లక్ష్యాన్ని ముంబైకి విధించాడు. రెండో బంతికే భారీ సిక్స్ తో ఆరంభించిన దూకుడు చివరివరకు సాగించాడు. అతడికి నేహాల్ వాదెరా (21) కాస్త తోడయ్యాడు. మిగతా బ్యాటర్లంతా అలా వచ్చి వెళ్లిపోయారు. తిలక్ విధ్వంసంతో మోస్తరు స్కోర్ తో ముంబై పరువు నిలుపుకుంది.
ఇద్దరే ఇద్దరు
సాధారణ లక్ష్యాన్ని ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ ఉఫ్ అంటూ ఊదేశారు. బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ముంబై బౌలర్లను ఆడుకున్నారు. బ్యాటింగ్ దిగడంతోనే దూకుడుగా ఆడారు. 7 పరుగులకు కోహ్లీ క్యాచ్ ఇవ్వగా ముంబై చేజార్చకుంది. డుప్లెసిస్ ఆరంభం నుంచి రెచ్చిపోయాడు. డుప్లెసిస్ కు అవకాశమిచ్చిన కోహ్లీ అనంతరం తాను కూడా బ్యాట్ ను ఝుళిపించాడు. మొదట డుప్లెసిస్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేయగా.. కోహ్లీ 38 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. 73 పరుగులు చేసి డుప్లెసిస్ ఔటవగా.. ఆ వెంటనే కార్తీక్ (0) అలా వచ్చి వెళ్లిపోగా.. మ్యాక్స్ వెల్ (12 నాటౌట్)తో కలిసి కోహ్లీ (84*) 16.2 ఓవర్లకే మ్యాచ్ ను ముగించాడు. డుప్లెసిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.