»Ipl 2023 Devon Conway Spinners Help Csk Defeat Srh In Chennai
IPL 2023: చెన్నై చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్..!
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై(CSK) కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్(SRH).. హారీ బ్రూక్కి జంటగా మయాంక్ అగర్వాల్ స్థానంలో అభిషేక్ శర్మని పంపింది. ఈ జంట మొదటి 4.1 ఓవర్లు నిలకడగానే ఆడి 35 పరుగులు రాబట్టింది. కానీ.. ఆకాశ్ బౌలింగ్లో ఐదో ఓవర్లో హారీ బ్రూక్ (18) వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ శర్మ కూడా ఔటైపోయాడు. ఇక అక్కడి నుంచి సన్రైజర్స్ వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగుతూ వెళ్లింది.
నెం.3లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (21), ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మర్క్రమ్ (12), హెన్రిచ్ క్లాసెన్ (17), మయాంక్ అగర్వాల్ (2), వాషింగ్టన్ సుందర్ (9) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. చివర్లో మార్కో జాన్సెన్ (17: 22 బంతుల్లో 1×4) క్రీజులో నిలవడంతో కనీసం ఈ 134 పరుగులైనా హైదరాబాద్ చేయగలిగింది.
135 పరుగుల లక్ష్య ఛేదనను చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (30 బంతుల్లో 35, 2 ఫోర్లు), డెవాన్ కాన్వే (57 బంతుల్లో 77 నాటౌట్, 12 ఫోర్లు,1 సిక్సర్) లు తొలి వికెట్ కు 11 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. మార్క్రమ్ వేసిన మూడో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన కాన్వే.. మార్కో జాన్సెన్ వేసిన ఆరో ఓవర్లో 4, 4, 6, 4, 4 బాదాడు. దీంతో ఆరు ఓవర్లలోనే చెన్నై 60 పరుగులు చేసింది. మార్కండే వేసిన 10 ఓవర్లో ఐదో బాల్ కు బౌండరీ కొట్టిన కాన్వే.. వరుసగా రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ పరాజయంతో సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆడిన ఆరు మ్యాచ్ లలో రెండు గెలిచి నాలుగు ఓడిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇకనుంచి సన్ రైజర్స్ వేసే ప్రతీ అడుగూ కీలకమే. ఇక చెన్నైకి ఇది ఆరు మ్యాచ్ లలో నాలుగో విజయం. తద్వారా ఆ జట్టు.. రాజస్తాన్, లక్నోతో పాటు ఆరు పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది.