»Indian Team Became The No 1 In Icc Test Rankings 2023
Indian team: ఆసీస్ ను వెనక్కి నెట్టి నెం.1 టెస్టు జట్టుగా భారత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
టీమ్ ఇండియా(Indian team) పురుషుల జట్టు 15 నెలల తర్వాత మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి మొదటి స్థానం కైవసం చేసుకుంది. అయితే వచ్చే నెలలో జరగనున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందే భారత్ ఈ ఘనతను సాధించడం విశేషం.
దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. మే 2020 నుంచి మే 2022 వరకు అన్ని సిరీస్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ICC మంగళవారం (మే 2) తాజా ర్యాంకింగ్‌లను ప్రకటించింది. వార్షిక అప్డేట్కు ముందు ఆస్ట్రేలియా 122 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, భారత్ మూడు పాయింట్లతో వెనుకబడి ఉండేది. అయితే, తాజా అప్డేట్ ప్రకారం భారత్ 121 పాయింట్లతో ఆస్ట్రేలియా(116) కంటే ఐదు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఐసిసి ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘమైన ఆట ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 15 నెలల తర్వాత వెనుకబడింది.
ఇదిలా ఉండగా జూన్ 7న లండన్‌లోని ఓవల్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇటీవల భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సారథ్యంలో జట్టు డబ్ల్యూటీసీని గెలవాలని భావిస్తోంది. మరోవైపు ఆసీస్ జట్టు WTC ప్రారంభ ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. కానీ న్యూజిలాండ్‌తో ఓడిపోయారు.
అదే సమయంలో ఇంగ్లండ్ 114 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇతర జట్లలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాలను ఆక్రమించాయి. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే వరుసగా చివరి నాలుగు స్థానాలను ఆక్రమించాయి.