అధిక రక్తపోటు(blood pressure) వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడి పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ క్రమంలో ఎడమ జఠరిక మందం సహా గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు వంటి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఈరోజుల్లో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఎక్కవగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే, వీటన్నింటికీ హైపర్ టెన్షనే కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది..? ఇది ఏ విధంగా గుండె, కిడ్నీ సమస్యలకు కారణమౌతుందో ఓసారి చూద్దాం.
ఆహారంలో మార్పులు, తప్పుడు జీవన శైలి కారణంగా బీపీ(BP) పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మనం తినే ఆహారం, చేసే పనులు శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే రక్తపోటు పెరుగుతుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న 1.28 బిలియన్ల మందికి అధిక రక్తపోటు(blood pressure) ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే. కాగా సుమారు 46 శాతం మందికి ఈ సమస్యతో బాధపడుతున్నట్టు కూడా తెలియదు.
ఉప్పు(salt) మన ఆహార రుచిని పెంచుతుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ప్రకారం.. మీ ఆహారంలో ఎక్కువ సోడియాన్ని చేర్చడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎన్ఐహెచ్(NIH) ప్రకారం.. మన మూత్రపిండాలు రోజుకు 120 క్వార్ట్లకు పైగా రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అవి శరీరం అంతటా కణాల నుంచి విషాన్ని బయటకు పంపుతాయి. ఇవి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తాయి. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలు ద్రవాన్ని తొలగించడం కష్టమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.
పగటిపూట ఎక్కువగా స్మోకింగ్ చేసేవారికి రక్తపోటు బాగా పెరుగుతుంది. స్మోకింగ్ మీ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. నిజానికి ధూమపానం రక్త నాళాలను కుదిస్తుంది. ఈ కారణంగా రక్తపోటు స్థాయి ఎక్కువగా ఉంటుంది. మద్యపానం అలవాటు ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనపడుతుందట.
మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే, ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బీఎంఐ(BMI) 25లోపు ఉంచుకోవడం, ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం,వారానికి ఒకసారి బీపీ పరీక్షలు(BP tests) చేయించుకోవడం చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. యోగా, మెడటేషన్ వంటివి చేస్తూ ఉండాలి.