సరికొత్త పథకంతో వచ్చింది ఏపీ సర్కారు. గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈ పథకాన్ని ఉచితంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. టిఫా స్కాన్ అనేది బిడ్డ తల్లి కడుపులో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రక్రియ. ఇందులో బిడ్డ వృద్దిరేటు, ఆరోగ్యం, లోపాలను గుర్తించడానికి ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది.
మామూలుగా ఒక్కో టిఫా స్కానింగ్ కు రూ.1100 లు, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ కు రూ.250 చొప్పున ఖర్చు భరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడుతూ… టిఫా స్కానింగ్ అనేది… గర్భంలోని శిశువు ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే ముందే పసిగడుతుందని, ముందుగానే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులలో టిఫా స్కానింగ్ తొందరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు కృష్ణబాబు. రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు మొదలైనట్లు తెలిపారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, గర్భిణుల ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణులను అనుసందానం చేసే వ్యవస్థ ఏర్పాటైనట్లు తెలిపారు. గర్భం ధరించిన తర్వాత 18, 22 వారాల మధ్య స్కానింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న గర్భినీలకు ఒక టీఫా స్కాన్, రెండు ఆల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులకు ఈ స్కానింగ్ లను చేసే పూర్తి వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిచామని ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ సీఈఓ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందని గర్భిణులకు ఇది శుభవార్తకన్నా ఎక్కువ అని అంటున్నారు ప్రజలు. ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.