High Drama At Telangana University, Students are Stopped VC press meet
Telangana University:తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) ఈ రోజు హై డ్రామా నెలకొంది. వైఎస్ ఛాన్స్లర్ రవీందర్ (Ravinder) ప్రెస్‌మీట్ నిర్వహిస్తోండగా కొందరు విద్యార్థి సంఘం నేతలు దూసుకొచ్చారు. పీసీ అడ్డుకొని.. వీసీ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు విద్యార్థులను బయటకు తీసుకెళ్లారు. యూనివర్సిటీకి కొత్త రిజిష్ట్రార్ నియామకంపై వీసీ రవీందర్ (Ravinder) అసంతృప్తిగా ఉన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పెత్తనం ఏంటీ అని నిలదీస్తున్నారు. తాను వీసీ అని.. తనది క్యాబినెట్ ర్యాంక్ అని చెబుతున్నారు.
ఏం జరిగిందంటే..?
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ రూసా భవనంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏం జరిగిందో తెలియదు కానీ వీసీ రవీందర్ వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత వీసీ అక్రమాలపై విచారణ కోసం ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది.
వర్సిటీ వీసీ రవీందర్ అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగంపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారించింది. సభ్యులు గంగాధర్ గౌడ్, వసుంధర దేవి, ప్రవీణ్ కుమార్ వర్సిటీని సందర్శించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యలో జరిగిన చెల్లింపులపై విచారిస్తున్నారు.
వీసీ అధికారాలు తగ్గించడం, ఇంచార్జీ రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణలు విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు కోసం నిర్ణయాలు పాలకమండలి సమావేశంలో తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీసీ రవీందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19వ తేదీన జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు.
నవీన్ మిట్టల్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని వీసీ రవీందర్ చెప్పారు. సీఎం, సీఎస్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆదివారం రాత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం ఇచ్చారని.. కలిసి మాట్లాడతానని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్ యాదగిరి నియామకం చెల్లదని రవీందర్ అంటున్నారు. ఆయన సీటులో కూర్చొంటే యాదగిరిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఈసీ సమావేశం జరిగిందన్నారు. చైర్మన్ లేకుండా సమావేశం నిర్వహించారని చెప్పారు. త్వరలో వర్సిటీకి రిజిస్ట్రార్ నియమిస్తామని పేర్కొన్నారు. ఇదివరకు ఈసీ మీటింగ్ నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదని చెప్పారు. నోట్ ఫైల్ లేకుండా రూపాయి ఖర్చు చేయలేదని అంటున్నారు. రూ.20 కోట్ల డబ్బులు రావాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.