ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తమ సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ పథకాన్ని (Voluntary Retirement Scheme-VRS) ప్రకటించింది. సంస్థను భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు, సంస్థను రోబో ఆధారిత ఉత్పాదకత వైపు మళ్లించాలనే లక్ష్యం, ఉద్యోగుల సంక్షేమం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని తమ సంస్థ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇది సంస్థలోని ఉద్యోగులందరికీ వర్తిస్తుందని చెప్పింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు వన్ టైమ్ సెటిల్మెంట్, వేరియేబుల్ పే, మెడికల్ కవరేజీ, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపు వంటి వాటితో ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించింది.
భారత అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ అయిన హీరో మోటో కార్ప్ కొత్త సీఈవో నిరంజన్ ను నియమించిన దాదాపు వారం తర్వాత సిబ్బంది పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. తమ కంపెనీ వీఆర్ఎస్ ను ప్రకటించినట్లు చెప్పింది. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటూనే వేగంగా అభివృద్ధి చెందుతున్న డైనమిక్ వాతావరణానికి అనుగుణంగా సంస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. కాగా, హీరో మోటో కార్ప్ మార్చి నెలలో 5.20 లక్షల యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది.