»Supreme Court Junks Plea By 14 Oppn Parties Against Misuse Of Cbi Ed By Centre
Supreme Court: ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై ప్రతిపక్షాలకు షాక్, తప్పు చేశామన్న ఓవైసీ
సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.
దర్యాఫ్తు సంస్థలు సీబీఐ, ఈడీలను (cbi and ed) కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న (misuse’ of CBI & ED by Centre) పిటిషన్ పైన సుప్రీం కోర్టులో (Supreme Court) విపక్షాల కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని పద్నాలుగు రాజకీయ పార్టీలు భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా, దీనిని విచారించేందుకు నిరాకరించింది. ఈ కేసులో వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ కుట్రలో (Political conspiracy) భాగంగా సీబీఐ, ఈడీలను (CBI and ED) మోడీ సర్కార్ దుర్వినియోగం (misuse’ of CBI & ED by Centre) చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నిన్నటి ఢిల్లీ మద్యం కుంభకోణం వరకు పక్కా ఆధారాలు వెలుగు చూసిన తర్వాతనే నిందితులుగా పేర్కొన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో విపక్షాలకు గట్టి దెబ్బ తగలింది. ఇది బీజేపీకి ప్లస్.
బుధవారం నాడు ఈ పిటిషన్ ను పరిశీలించిన చీఫ్ జస్టిస్.. విచారణ పైన అనుమానాలు వ్యక్తం చేశారు. కేసుల దర్యాఫ్తులు, విచారణ నుండి విపక్ష నేతలకు రక్షణ కల్పించేందుకు పిటిషన్ వేశారా, వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా అని ప్రతిపక్షాల తరఫున వాదించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించారు సుప్రీం చీఫ్ జస్టిస్. అయితే తాము ఎలాంటి రక్షణ లేదా మినహాయింపులు కోరడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ఆ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. చట్ట ప్రకారం పారదర్శక దర్యాఫ్తును కోరుకుంటున్నట్లు చెప్పారు. సింఘ్వీ వాదనను సీజేఐ అంగీకరించలేదు.
ఈ పిటిషన్ ప్రత్యేకంగా రాజకీయ నాయకులు వేశారని, సామాన్య పౌరుల అభిప్రాయం తీసుకోలేదని, పిటిషన్ లో చేసిన ఆరోపణలను ధృవీకరించేలా ఒక్క కేసును కూడా పేర్కొనలేదని, అలాంటప్పుడు మార్గదర్శకాలను ఎలా జారీ చేయగలమని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా మార్గదర్శకాలు జారీ చేయడం ప్రమాదకరం అన్నారు. ఈ పిటిషన్ ను కూడా విచారించలేమని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా లేదా బృందంగా కానీ ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసుల ఆధారంగా పిటిషన్ వేస్తే తాము పరిశీలిస్తామని తెలిపారు.
సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో విపక్షాలు ఈ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాయి. పిటిషన్ వేసిన పార్టీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దల్ యూ, రాష్ట్రాయ జనతా దళ్, సమాజ్ వాది, శివసేన (ఉద్దవ్ థాకరే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, డీఎంకే ఉన్నాయి.
తప్పు చేశారన్న అసదుద్దీన్
కేంద్ర దర్యాఫ్తు సంస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మీద పలు రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లాయని, అక్కడ చుక్కెదురు కావడంతో ఈ చర్య తమను తాము సమర్థించుకోవడానికి బీజేపీకి ఉపయోగపడిందని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఏజెన్సీలను ఉపయోగించి తమను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రజల్లోకి వెళ్లవలసిందని, కానీ కోర్టుకు వెళ్లి తప్పు చేశాయన్నారు. మోడీ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే సమయంలో మనం ఇష్టారీతిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్లడం అనాలోచిత నిర్ణయమన్నారు. మేం తప్పు చేస్తే సుప్రీం కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చేదిగా, అంటే మేం తప్పు చేయడం లేదని న్యాయస్థానం ద్వారా తెలుస్తోందని బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతోందన్నారు.