విధి ఎంత విచిత్రమో.. ఎలాంటి దాన్నైనా విధి మార్చేస్తుంది. తలరాత అనేది మన చేతుల్లో ఉండదు. ఆ విధి ఎంత దారుణాలకు దారి తీస్తుందో మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. తన భర్త వర్ధంతి జరిపించేందుకు తెలంగాణ నుంచి కర్నూల్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కానీ ఏ కార్యం చేయడానికి వస్తుందో అదే రోజు ఆమె అంత్యక్రియలు జరిపించాల్సిన దయనీయ పరిస్థితి. భర్త వర్ధంతి రోజే భార్య అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామానికి చెందిన పాటిల్ శేషిరెడ్డి. ఆయన కడప జిల్లాకు చెందిన హైకోర్టు జడ్జి రామచెన్నారెడ్డి కుమార్తె నీరజా రెడ్డితో వివాహం జరిగింది. శేషిరెడ్డి కుటుంబం ధనవంతులు కావడంతో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. దీంతో శేషిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలోనే 1996 ఏప్రిల్ 18వ తేదీన దారుణంగా హతమార్చారు.
భర్త రాజకీయ వారసత్వాన్ని నీరజా రెడ్డి తీసుకున్నారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా.. 2009లో అలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నీరజా గెలిచారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. కాగా, శుక్రవారం భర్త శేషిరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఉండడంతో హైదరాబాద్ నుంచి కర్నూలుకు నీరజా బయల్దేరారు. మార్గమధ్యలో తెలంగాణలోని బీచుపల్లి క్షేత్రం వద్ద టైర్ పగిలి వాహనం రోడ్డుపై నుంచి ఖాళీ ప్రదేశంలో ఎగిరి పడింది. తీవ్ర గాయాలతో మృతి చెందింది. కాగా ఆమె అంత్యక్రియలు తెర్నేకల్ గ్రామంలో శుక్రవారం జరిగాయి. భర్త వర్ధంతి ఏప్రిల్ 18వ తేదీనే నీరజా రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆమె కుమార్తె, అల్లుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు.