అతడు ఒక రంజీ ఆటగాడు.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టులో ప్లేయర్. ప్రస్తుతం క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆర్థిక కష్టాలతో మోసాల (Fraud)కు పాల్పడుతున్నాడు. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao), ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)ల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు బుడుమూరు (Nagaraju Budumuru)కు క్రికెట్ (Cricket) అంటే ఎంతో ఇష్టం. ఎంబీఏ చదివిన నాగరాజు క్రికెట్ లో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 2009లో అండర్-19లో క్రికెట్ ఆడాడు. అనంతరం 2014-16 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్) (Ranji Trophy) ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం 2016-18లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నాగారాజు అవకాశం దక్కించుకున్నాడు. దీంతోపాటు ఇండియా- బీ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్ కు దూరమయ్యాడు.
గతంలో తనను ఓ రాజకీయ నాయకుడు (Political Leader) మోసం చేశాడని.. అదే మాదిరి రాజకీయ నాయకుల పేరుతో తాను మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే 2021లో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) (Personnel Secretary) అని పేరు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలను రూ.40 లక్షల దాక మోసం చేశాడు. 2018 నుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 60కి పైగా కంపెనీలను నాగరాజు మోసం చేశారు. దాదాపు రూ.3 కోట్లకు పైగా అతడు మోసం చేశాడని సమాచారం.
ఈ క్రమంలోనే ముంబై (Mumbai)కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేసి స్పాన్సర్ షిప్ (Sponsorship) కావాలని కోరాడు. దీనికి వైఎస్ జగన్ పీఏనని నమ్మించి రూ.12 లక్షలు మోసం చేయాలని ప్రయత్నించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో బుధవారం రాత్రి ముంబై పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. చాలా మందిని నాగారాజు మోసం చేసినట్లు వెలుగులోకి వస్తోంది. ఇలా ప్రముఖుల పేర్లు చెప్పి.. వారి ఫొటోలను డీపీలుగా వాడుకొని నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అతడిపై దాదాపు 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.