టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యోగులను తొలగించేందుకు డెల్ కంపెనీ సిద్ధమవుతోంది.
డెల్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెల్ ఉద్యోగుల్లో 5 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మధ్యకాలంలో లేఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్న టెక్ సంస్థల్లో డెల్ కూడా చేరినట్లుగా వ్యాపార రంగ మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ తెలిపింది. డెల్ కంపెనీ ఇతర కంపెనీల బాటలోనే నడుస్తోందని, 2021 నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2022 త్రైమాసికంలో 37 శాతం నష్టాలు చవిచూసిందని ఐడీసీ వెల్లడించింది. డెల్ సంస్థకు 55 శాతం ఆదాయం పర్సనల్ కంప్యూటర్ల విక్రయాల ద్వారానే లభిస్తున్న సంగతి తెలిసిందే.