Vizag:విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు ఏపీ సీఎం జగన్ (cm jagan) ఈ రోజు శంకుస్థాపన చేశారు. 130 ఎకరాల్లో 300 మెగా వాట్ డేటా పార్క్‌ను అదానీ గ్రూప్ నిర్మిస్తోంది. సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్ వ్యవస్థ తీసుకొస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. డేటా సెంటర్లో బిజినెస్ పార్క్, ఐటీ స్కిల్ ఫెసిలిటీ, రిక్రియేషన్ సెంటర్ ఉంటుంది. ఇందుకోసం అదానీ గ్రూప్ రూ.22 వేల కోట్ల ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. డేటా సెంటర్ వల్ల 40 వేల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు.
డేటా సెంటర్ రావడం వల్ల విశాఖ టైర్ 2 సిటీ నుంచి టైర్ 1 సిటీగా మారుతుందని సీఎం జగన్ అన్నారు. దీంతో కనెక్టివిటీ, ఇంటర్నెట్ వినియోగం, స్పీడ్ పెరుగుతుందని తెలిపారు. డేటా సెంటర్ మొత్తం గ్రీనరీ అని పేర్కొన్నారు. విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉందని సీఎం జగన్ అన్నారు . డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో సిటీ దూసుకెళ్తుందని చెప్పారు. సాగర నగరానికి ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తోందని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెంటర్ విశాఖకు వస్తోందని.. దీంతో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసిన అదానీ గ్రూపునకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుందని వివరించారు. విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరంగా మారనుందని తెలిపారు.