»Chhattisgarh Coal Levy Scam Ed Raids Multiple Places In Raipur Bilai
Plenary వేళ కాంగ్రెస్ కు షాక్.. ఎమ్మెల్యేల ఇళ్లపై ED దాడులు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.
బొగ్గు కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మరోసారి దాడులు చేపట్టింది. చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుల నివాసాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. అయితే చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పుర్ (Raipur) వేదికగా ఈనెల 24 నుంచి 26 వరకు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ (Plenary) సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలకు ముందే ఈడీ దాడులు చేయడం రాజకీయంగా కలవరం రేపింది. కాంగ్రెస్ నే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఈడీ దాడులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. కక్షపూరిత రాజకీయాలతోనే నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం దాడులు చేయిస్తోందని తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
చత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే ఈడీ బృందాలు సోదాలు మొదలుపెట్టాయి. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ పార్టీ చత్తీస్ గఢ్ రాష్ట్ర కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, ఇతర నాయకులు సుశీల్, ఆర్పీ సింగ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు దాడులు చేశాయి. ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లకు చెందిన ప్రదేశాల్లో ఈ సోదాలు జరుగుతుండడం కలకలం రేపింది. వారందరికీ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కాగా ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈడీ దాడులకు నిరసనగా రాష్ట్రంలో పలుచోట్ల ఆ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండడంతోనే దాడులకు బీజేపీ ఉసిగొల్పిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇవేమీ తమను అడ్డుకోలేవని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగెల్ (Bhupesh Baghel) స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.
చత్తీస్ గఢ్ లో భూ కుంభకోణం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో రెండేళ్లల్ో రూ.450 కోట్ల మేరకు దోపిడీ కుట్ర జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ వరుసగా తనిఖీలు చేపట్టింది. గతంలో కూడా దాడులు చేపట్టింది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం ఉప కార్యదర్శి సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్, సూర్యకాంత్ తివారీ, బొగ్గు వ్యాపారవేత్త సునీల్ అగర్వాల్ తో పాటు 9 మందిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సమాచారం. అయితే ఈ సోదాల విషయమై ఈడీ అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.