»Setback For Arvind Kejriwal As Delhi High Court Puts His Bail On Hold
Kejriwal : కేజ్రీవాల్ మళ్లీ జైల్లోనే! బెయిల్‌పై దీల్లీ హైకోర్టు స్టే!
కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ని శుక్రవారం దిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Arvind Kejriwal Bail : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో గత కొన్ని రోజులుగా తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఆయనకు దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ విషయమై ఈడీ(Enforcement Directorate) హైకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును సవాల్ చేసింది. అత్యవసర విచారణను కోరింది. అయితే హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను దిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు ఈ తిరస్కారంతో గట్టి దెబ్బ తగిలినట్టు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో జరుగుతోంది. అయితే ఈడీ ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుదేజాలతో కూడిన ధర్మాసనం ఈ విషయమై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును తాము సమగ్రంగా విచారించేంత వరకు ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు కావని తెలిపింది. అప్పటి వరకు బెయిల్‌ని హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పింది.
గురువారం ట్రయిల్ కోర్టు కేజ్రీవాల్‌కు(KEJRIWAL) సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తుతో విడుదల చేయడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఆ బెయిల్( bail) నిలిచిపోయింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.