Chandrababu Naidu: జగన్ ప్రోద్భలంతోనే టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగిన దాడిని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసన సభలోనే ఎమ్మెల్యేల పైన దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగిన దాడిని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసన సభలోనే ఎమ్మెల్యేల పైన దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్బలంతోనే దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పైన దాడి జరిగిందని ఆరోపించారు. చట్ట సభలకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా జగన్ నిలిచిపోతారన్నారు. సోమవారం సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. వైసీపీ సిద్ధాంతం ప్రజలకు అర్థమైందని, ఇది శాసన సభ కాదని, కౌరవ సభ అని నిప్పులు చెరిగారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించారన్నారు. సభలో స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలు డోల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడారు. తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
ఏం జరిగింది?
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే (YSRCP MLA) టీజేఆర్ సుధాకర్ బాబు (TJR Sudhakar Babu) దాడి చేసి… స్పీకర్ పొడియం కిందకు నెట్టి వేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampally Srinivas) టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) దగ్గర ఉన్న ప్లకార్డును లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించి నిరసన తెలిపారు. జీవో నెంబర్ వన్ ను చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో స్పీకర్ చైర్ దగ్గరకు వెళ్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు.
నారా లోకేష్ ఆగ్రహం
ప్రజాస్వామ్య విలువలకి నిలువెత్తు సంతకంలా నిలిచే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లపై ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగబడటం దారుణం. బుచ్చయ్య తాతపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్ డే. ఏడుపదుల వయస్సు దాటిన పెద్దాయనని చూస్తేనే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దాడికి మీకు మనసు ఎలా ఒప్పింది? అధికారం కోసం సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు, బుచ్చయ్య తాతని గౌరవిస్తారనుకోవడం వృథా ప్రయాస. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కర్రుకాల్చి వాత పెట్టినా ఫ్యాక్షన్ బుద్ధి మారలేదు అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులపై వైసీపీ దమనకాండ అసెంబ్లీలోనూ కొనసాగింది. దళిత మేధావి, అజాతశత్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం. బ్రిటీష్ కాలంనాటి జీవో1 తెచ్చి ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం దళిత ఎమ్మెల్యే చేసిన పాపం అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దళిత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిపై దాడి చేయించడం ద్వారా తన ప్రయాణం నేరాలతోనే, తన యుద్ధం దళితులపైనే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు అని వ్యాఖ్యానించారు.