అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amarawati Inner Ring Road case)పై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు (Chandrababu)ను చేర్చుతూ సీఐడీ (CID) మరో పిటీషన్ను కోర్టు ముందు ఉంచింది. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్య ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఇంటి నుంచే భోజనం, మందులు తెప్పించుకోవడానికి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతి ఇచ్చింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ను చంద్రబాబుపై దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరినట్లు సమాచారం. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి కావాలని సీఐడీ కోరింది.
ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, ఏ6గా నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నట్లు సీఐడీ తన పిటీషన్లో తెలిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్లో తెలిపింది. మరోవైపు రేపటి నుంచి టీడీపీ నేతలు దీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.