మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు(Daggubati Venkateswara rao) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో శనేశ్వరస్వామి వారి ఆలయ దర్శనానికి శుక్రవారం దగ్గుబాటి వెళ్లారు. శని త్రయోదశి సందర్భంగా నేడు శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగా ఆయన కళ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సన్నిహితులు ఆయనను ఆలయం వద్ద నీడలో కాసేపు ఉంచి పర్యవేక్షించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు పూజను ముగించేంత వరకూ ఆయన అక్కడే ఉన్నారు.
పూజ అయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చికిత్స అందించారు. గతంలో కూడా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఓసారి ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది. ఆ టైంలో ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన భార్య పురందేశ్వరి(Daggubati Purandheswari) మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.