»Onion Which Is Competing With Tomato Has Seen A Huge Price Increase Within 4 Days
Onion price: టమాటాతో పోటీ పడుతోన్న ఉల్లి..4 రోజుల్లోనే ధర భారీగా పెరుగుదల
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
సామాన్యుడికి కూరగాయల ధరలు షాకులిస్తున్నాయి. వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఉల్లి, టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోన్న టమాటో ధరకు ఇప్పుడు ఉల్లి ధర కూడా చేరింది. ఉల్లి కూడా అందరి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరుగుదల నమోదు చేసింది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర ఇప్పుడు రూ.20 నుంచి 25కి పెరిగింది.
ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ లో చూస్తే వాటి ధరలు 25 శాతం పెరిగాయి. ఉల్లి మార్కెట్లలో శుక్రవారం క్వింటాల్ ఉల్లిపాయల ధర 1300 రూపాయలకు చేరిందని, రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు వెల్లడించారు. జూన్ 27న నాసిక్ మండిలో ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.1201 కాగా మరుసటి రోజు దాని ధరలో రూ.79 పెరిగింది. జూన్ 28న ఉల్లి ధర క్వింటాల్‌కు 1280కి పెరగ్గా 29న ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1280 నుంచి రూ.1300కి చేరింది.
టమాటా తర్వాత ఉల్లి ధర పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇదే విధంగా పెరిగితే రాబోయే రోజుల్లో మరింత కష్టంగా మారుతుందని చెబుతున్నారు. ఈ సంవత్సరం, మహారాష్ట్రతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉల్లిపాయల పంట బాగా పండిందని, ధరల్లో మార్పులు వస్తాయని అధికారులు తెలిపారు. త్వరలోనే టమోటాతో పాటుగా ఉల్లి ధర కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.