మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 25 మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్రంలో బుల్దానా సమృద్ధి మార్గ్ ఎక్స్ప్రెస్ హైవేపై శనివారం వేకువజామున 2 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. యావత్మాల్ నుంచి పూణేకు 32 మంది వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. ఘటనలో 25 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
తెల్లవారుజాము కావడంతో ఆ చుట్టు ప్రాంతాల్లో ఎవ్వరూ లేరు. చివరి నిమిషంలో ఆవైపుగా వెళ్తున్న వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పి సహాయక చర్యలు చేశారు. 25 మంది సజీవ దహనం అవ్వడంతో ఆ ప్రాంతమంతా భయకంపితంగా మారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొంత మందిని స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగానే ఉందని, బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు వెల్లడించారు.