ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్‌లో సజీవ దహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు కంటైనర్లు ఢీకొనడం వల్ల ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా(Medak District)లో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదం(Road accident)లో ఇద్దరు సజీవ దహనం అయిన ఘటన మెదక్ జిల్లాలోని నార్సింగి మండలంలో చోటుచేసుకుంది. 44వ నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కాస్లాపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి వచ్చిన మరో కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో లారీల నుంచి మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఓ కంటైనర్(Container) ఫుల్ లోడింగ్‌తో నాగ్‌పూర్ వైపు ప్రయాణిస్తోంది. ఆ క్రమంలో నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద టైరు పేలిపోయింది. కంటైనర్ అదుపు తప్పి మరొక కంటైనర్‌ను ఢీకొంది. దీంతో లారీలో ఉన్న నాగరాజు, బసవరాజు అనే ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం(2 died) అయ్యారు.
ఈ ప్రమాదం(Accident)పై స్థానికుల సమాచారం మేరకు..అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. సీఐ లక్ష్మీరాజు, నార్సింగి ఎస్ఐ నర్సింగ్ ఇద్దరూ మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.