Baby Movie Review
చిత్రం: బేబీ
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, ప్రభావతి లిరీష, తదితరులు
కథ, దర్శకత్వం: సాయి రాజేశ్
నిర్మాత: ఎస్కేఎన్
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫి: ఎమ్ఎన్ బాల్ రెడ్డి
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
రిలీజ్ డేట్: 14-07-2023
యూత్ ను ఆకర్షించే మరో ట్రైయాంగిల్ కథతో ఈ వారం మన ముందుకు వచ్చిన చిత్రం బేబీ(Baby). చిన్న సినిమాలు అయినా ప్రేక్షకులు మెచ్చేలా చేస్తూ వెండితెరపై అందరిని ఆకర్షిస్తున్న హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాన్ని చేజిక్కించుకున్న వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya) మరో నటుడు విరాజ్ అశ్విన్(viraj Ashwin) తదితరులు నటించిన ఈ చిత్రం స్టోరీ, విశేషాలు ఏంటో చూద్దాం.
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఇద్దరు ఓ బస్తీలో పుట్టి పెరిగిన బాల్య స్నేహితులు. ఒకే స్కూల్లో చదివిన ఈ ఇద్దరు ప్రేమించుకుంటారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో నడుపుతూ జీవితం కొనసాగిస్తుంటే.. వైష్ణవి ఇంటర్ పాసై ఇంజనీరింగ్‌లో చేరుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో తన క్లాస్‌మెట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)తో పరిచయం ఏర్పడుతుంది. వీరి స్నేహం కాస్త అడ్డదారులు తొక్కుతుంది. వీరు శారీరంగా దగ్గర అవుతారు. ఆ తర్వాత ఏం అయింది.? వీరి వ్యవహారం ఆనంద్ కు తెలిసిందా.? విరాజ్ లవ్ ప్రపోజల్‌ను వైష్ణవి ఎందుకు రిజెక్ట్ చేసింది? వైష్ణవిలో మార్పు వల్ల ఆనంద్ ఎలాంటి బాధకు గురయ్యాడు? వైష్ణవి, ఆనంద్, విరాజ్ ట్రాయంగిల్ లవ్ స్టోరికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బేబీ సినిమా. (Baby Telugu Movie Review)
ఆనంద్ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్లతో మొదలుపెట్టి.. కథలోకి తీసుకెళ్లిన తీరు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆనంద్, వైష్ణవి మధ్య స్కూల్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్, ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. వైష్ణవి కాలేజీలో చేరడం, విరాజ్‌కు చేరువ కావడంతో కథలో ఓ మలుపుతో ఊపందుకొంటుంది. ఆనంద్, వైష్ణవి మనస్పర్ధలతో కథ కొంత క్రిటికల్‌గా మారుతుంది. ఇక పబ్‌లో ఓ ఎమోషనల్, హైడ్రామా ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ను ఎమోషనల్‌గా ముగించడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి. ఇక సెకండాఫ్‌లో విరాజ్, వైష్ణవి డేటింగ్ వ్యవహారం కథను మరో మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. వైష్ణవి చేసిన ఆ తప్పు ఆనంద్‌కు తెలిసిన తర్వాత ముగ్గురి మధ్య డ్రామా పీక్స్‌కు చేరుకొంటుంది. ఇక క్లైమాక్స్ కు ఎలా ఉంటుంది అని ప్రేక్షకుడి ఉత్కంఠతతో ఉంటాడు. దర్శకుడు సాయి రాజేశ్ రాసుకొన్న పాయింట్ అద్బుతంగా ఉందని చెప్పవచ్చు. ముగ్గురి మధ్య ప్రేమ కథను పొరలు పొరలుగా విస్తరించిన తీరు..ఎక్కడా పట్టు తప్పకుండా కథను నడిపించిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్ విషయంలో ఎక్కువగానే అంతర్మథనం పడటం, తడబాటు పడినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా కథను, పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో సాయి రాజేష్ ఫుల్ మెచ్యురిటీని చూపించాడని చెప్పవచ్చు.
ఆనంద్ దేవరకొండ మరోసారి అద్బుతంగా నటించాడు. సెకండాఫ్‌లో తన నటన విశ్వరూపమే చూపించమే కాకుండా గుండెను పిండేసేలా పెర్ఫార్మ్ చేశారు. ఇక విరాజ్ అశ్విన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్, స్టెయిల్‌గా, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. తన క్యారెక్టర్ వరకు విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. ఇక సినిమాకు బ్యాక్ బోన్ వైష్ణవి చైతన్య. ఎవరూ ఊహించని విధంగా, పాత్ర పరిధిని దాటి ఊహకు అందని విధంగా ఫెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. హీరోయిన్గా తొలి చిత్రంతోనే సినిమా భారాన్నంతా తన భుజాలపై మోసిందనే చెప్పాలి. డ్యాన్సులతో అదరగొట్టింది. కళ్లతోనే హావభావాలను ప్రదర్శించింది. పాత్రలో ఉన్న వేరియేషన్స్‌ను సులువుగా పండిచిందని చెప్పాలి. నాగబాబు, వైవా హర్ష, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
బేబీ సినిమాను హిట్ జోన్లోకి చేర్చింది విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. ఒకే ఒక పాటతో బ్లాక్ బస్టర్ ఫీలింగ్‌ను తీసుకొచ్చాడు. ఓ రెండు ప్రేమ మేఘాల పాట మాత్రమే కాకుండా.. బీజీఎంతో పలు చోట్ల హృదయాన్ని పిండేశాడు. పలు సీన్లను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫీల్‌గుడ్‌గా మార్చాడు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చెక్కినట్టు చూపించాడు. విప్లవ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎస్కేఎన్, ధీరజ్ పాటించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి. లవ్, ఎమోషన్స్‌తోపాటు ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉన్న చిత్రం బేబీ.
కథా, కథనం
యువతరం మెచ్చే అంశాలు
మ్యూజిక్, బీజీఎమ్
సీన్ల సాగదీత
క్లైమాక్స్