»Ap Mlc Elections Tdp Leaders Saying 16 Ycp Mlas Are Voting For Anuradha
AP MLC Elections: 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాకే.. టీడీపీ, గంటా, కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (andhra pradesh mlc elections) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసి, వారితో ఓట్లు వేయిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam Party) నుండి 23 మంది, వైసీపీ నుండి 151, జనసేన (Janasena) నుండి 1 గెలిచారు. ఓటింగ్ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు (Telugu Desam Party leaders) కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) టచ్ లో ఉన్నారని, తమ పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పైన అసంతృప్తితో ఉన్నారు కాబట్టే తమతో సదరు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారని అంటున్నారు. వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకీ ఓటు వేస్తారని ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా (Ganta resign) ఆమోదం పొందిందని ప్రచారం జరగడంపై ఆయన స్పందించారు. తాను రెండేళ్ల క్రితం రాజీనామా చేశారనని, స్పీకర్ ను రెండుసార్లు కలిశానని గుర్తు చేశారు. తన రాజీనామా ఆమోదం పొందిందని జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదే అన్నారు. తన రాజీనామా ఆమోదించారంటూ రాత్రి నుండి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా ఆమోదించని రాజీనామా గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవబోతున్నారన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే నా రాజీనామాను ఆమోదించారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీలో ఒక ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలా చేస్తే వైసీపీ అసంతృప్తులు వెనక్కి తగ్గుతారనేది వారి అభిప్రాయమన్నారు. అయినా ఓటర్ లిస్ట్ వచ్చాక రాజీనామా ఆమోదించడం సాంకేతికంగా కుదరదన్నారు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్లు అవుతుందన్నారు. పంచుమర్తి అనురాధ నామినేషన్ పత్రాల పైన ప్రపోజల్ సంతకం తనదే అన్నారు.
వైసీపీ నుండి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారని, తమతో టచ్ లో ఉన్నారని మీ పార్టీ నేతలు చెబుతున్నారు కదా అని అడగ్గా… అలా చెప్పిన వారిని అడగాలని సూచించారు.
అంతరాత్మ ప్రభోదానుసారం కోటంరెడ్డి
తాను అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేశానని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) అన్నారు. ప్రజాస్వామ్యంలో దానిని చెప్పడం సరికాదన్నారు. అంతరాత్మ ప్రబోధానుసారం ఎంతమంది ఓటు వేశారని చెప్పేందుకు తాను వారి ఆత్మలోకి దూరి చూసేందుకు దేవుడిని కాదన్నారు. ఎవరు అలా వేశారో తనకు తెలియదన్నారు.
పిచ్చి ప్రేలాపనలు వద్దు
టీడీపీకి బలం లేకపోయినా పోటీ చేస్తున్నారనే పిచ్చివాగుడు వాగుతున్నారని, కానీ టీడీపీకీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని వైసీపీకి సూచించారు అచ్చెన్నాయుడు. శాసన సభలో స్పీకర్ పార్టీల బలాబలాలు చదవాలన్నారు. పిచ్చి ప్రేలాపనలు వద్దని హితవు పలికారు. తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేస్తున్నామన్నారు. తమకు ఇప్పటికే బలం ఉందని, పైగా అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమకు ఓటు వేస్తారన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తారన్నారు. నిన్నటి వరకు తమకు దూరంగా ఉన్న తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ గౌరవం లేక, మా వైపే వచ్చారన్నారు.