»Another 12 Cheetahs Arrived At Kuno National Park
Cheetah నాడు 8.. నేడు మరో 12.. చీతాల అడ్డాగా భారతదేశం
పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో గతంలో ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కాకపోతే ఈ ప్రక్రియ అనేక కారణాలతో ఆగిపోయింది. 71 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధతో చీతాలను భారతదేశానికి రప్పించారు.
దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetah) పునరుద్ధరణ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం (Indian Government) ప్రత్యేక దృష్టి సారించింది. చీతాల సంఖ్య పెంచాలని విదేశాల నుంచి ప్రత్యేకంగా వాటిని తీసుకు వస్తుంది. ఇప్పటికే ఒక దశలో 8 చీతాలు భారతదేశాని (India)కి రప్పించారు. తాజాగా మరో 12 చీతాలు మన దేశానికి చేరుకున్నాయి. ఆ చిరుతలను మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) స్వయంగా విడుదల చేశారు. వాటిని ఎన్ క్లోజర్ లోకి వదిలారు.
గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికా (Africa)లోని నమీబియా (Namibia) నుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కు (Kuno National Park) కు తరలించారు. తన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చీతాలను విడుదల చేశారు. వాటికి సంబంధించి ఫొటోలు తీస్తూ సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించారు. వీటి కోసం ప్రత్యేక విమానం నడిపారు. దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ విమానం శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో చేరుకుంది. ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్కుకు తరలించారు.
తాజాగా దేశానికి చేరుకున్న చిరుతల్లో 7 మంగవి, ఐదు ఆడవి ఉన్నాయి. వీటిని ఒక నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు. విదేశం నుంచి రావడంతో ఇక్కడ అవి అలవాటు పడేందుకు కొన్నాళ్లు ప్రత్యేక ఎన్ క్లోజర్ లో అవి ఉంటాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. ఆ తర్వాత వాటిని అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా వదిలేస్తారు. తాజాగా చేరుకున్న వాటితో కలిపి భారతదేశంలో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరాయి. 1952లో భారతదేశంలో అంతరించిపోయాయి. పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో గతంలో ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కాకపోతే ఈ ప్రక్రియ అనేక కారణాలతో ఆగిపోయింది. 71 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధతో చీతాలను భారతదేశానికి రప్పించారు. ప్రస్తుతం ఆ చీతాలతో కూనో జాతీయ పార్క్ సందడిగా మారింది. వాటిని చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు.