»Amit Shah Is Comments On Brs And Congress Government
Amit Shah: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై మండిపడ్డ అమిత్ షా
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు నిజాం పాలనలో నలిగిపోయారని గుర్తు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమెదించినట్లు వెల్లడించారు. రజాకార్ల చేతిలో 200 మంది మృతి చెందిన కర్ణాటక బీదర్‌లోని గోరటాలో అమరవీరుల స్మారక స్థూపాన్ని అమిత్ షా ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. గోరాటలో మే 9, 1948న 200 మందిని ఊచకోత కోశారని షా గుర్తు చేశారు. ఇలాంటి క్రమంలో ఈ ప్రాంతం “దక్షిణ భారతదేశంలోని జలియన్‌వాలాబాగ్” అని పిలవబడుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో “క్రూరమైన నిజాం పాలన” నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా విమోచన దినోత్సవం జరుపుకోకపోవడం దారుణమని అన్నారు. సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించిన షా, పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు విముక్తి ఉండేది కాదని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని (సెప్టెంబర్ 17) జరుపుకోవడానికి వెనుకాడుతోందని ఎద్దేవా చేశారు. కానీ అమరుల త్యాగాలకు గుర్తుగా బీజేపీ గత ఏడాది తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించిందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఆ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు.
అంత మారణకాండ జరిగినా, ఓటు బ్యాంకు కోసం హైదరాబాద్ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారిని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తుపెట్టుకోలేదని షా అన్నారు. ఈ రోజు 103 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు గర్వంగా ప్రకటించగలను, అది ఎవరూ చేరుకోలేరని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల క్రితం తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కర్ణాటక వెళ్లి అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశానని షా గుర్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేసే అవకాశం మళ్లీ తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు.