»Amarnath Yatra Stopped Due To Landslides 200 Telugu People Trapped
Amarnath yatra: కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన అమర్నాథ్ యాత్ర..చిక్కుకున్న 200 మంది తెలుగువారు
భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని అధికారులు మూసివేశారు. అంతేకాకుండా రెండో రోజు అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేస్తూ ప్రకటన చేశారు.
భారీ వర్షాల వల్ల అమర్నాథ్ యాత్ర(Amarnadh Yatra) రెండో రోజు కూడా నిలిచిపోయింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్రను అత్యవసరంగా నిలిపివేశారు. పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రను అధికారులు ఆపారు. దీంతో అమర్నాథ్ యాత్రికులు బల్తాల్, నువ్వాన్ బేస్, భగవతి నగర్ బేస్ క్యాంపులలో తలదాచుకుంటున్నారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల పంచతర్ణి ప్రాంతంలో పదిహేను వందల మందికి పైగా భక్తులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
పంచతర్ణి ప్రాంతంలో చిక్కుకున్న వారిలో 200 మంది వరకూ తెలుగువారు ఉన్నట్లు సమాచారం. శనివారం ఉదయం కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని భక్తులను అధికారులు అలర్ట్ చేశారు. ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులకు భోజన వసతి సౌకర్యాలను కల్పించారు.
కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ కారణంగా అమర్నాథ్ యాత్ర(Amarnadh Yatra)ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుల్లో ఉంచి సురక్షితంగా కాపాడుతున్నామన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం కూడా యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు. అనుకూల వాతావరణంలో తిరిగి యాత్రను కొనసాగిస్తామని, అంత వరకూ యాత్రను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.