»Amaravati Is The Andhra Pradesh Capital Nara Lokesh
Nara Lokesh: రాజధాని ఒకేచోట, జగన్ కళ్లలోకి సూటిగా చూడలేరు
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి రాజధాని ఒకే చోట ఉండాలని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఐటీ కంపెనీలు వస్తే విశాఖకు, టీసీఎల్ వస్తే తిరుపతికి, కియాను అనంతపురంలో, సిమెంట్ కంపెనీలను కర్నూలులో, ఫార్మాను మరోచోట… ఇలా చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ చేశారని గుర్తు చేశారు. రాజధానులు మూడు అయితే, సచివాలయం నుండి విమానాశ్రయానికి, అక్కడి నుండి విశాఖకు.. ఇలా గంటలో అయ్యే పని రెండు రోజులు పడుతుందన్నారు. ఆయన (జగన్) ఏ ఆత్మతో మాట్లాడారో… ఎవరు ఐడియా ఇచ్చారో తెలియదన్నారు. పరిపాలన ఒకేచోట ఉండాలని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాల్సిందే అన్నారు. ఏపీ రాజధాని అమరావతే అని కుండబద్దలు కొట్టారు. అందులో రెండో ఆలోచన లేదన్నారు. యువతకు ఉద్యోగాలు స్థానికంగానే రావడం టీడీపీ ఉద్దేశ్యమన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా.. అభివృద్ధి చేసాడా అని ప్రశ్నించారు. రుషికొండను కొట్టడం మినహా ఏం చేయలేదన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి అయిదేళ్లు గడపడం మినహా ఏం చేయలేదన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ స్పీడ్, కర్నాటక స్పీడ్‌ను ఆయన పోల్చుకోవడం లేదన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్నో పరిశ్రమలు తీసుకు వచ్చి, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి కల్పించామన్నారు. 2014లో లోటు బడ్జెట్లో చంద్రబాబు సీఎం అయినప్పటికీ, సంక్షేమం-అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు తీసుకు వెళ్లారన్నారు. జగన్ సచివాలయానికి వెళ్లడానికి వేసిన రోడ్లు, సమావేశాలు నిర్వహిస్తున్న సచివాలయం, కేబినెట్ నిర్వహిస్తున్న రూమ్ కట్టింది, శాసన సభ, శాసన మండలి నిర్మాణాలు కూడా చంద్రబాబు కట్టినవే అన్నారు. జగన్ హైకోర్టుకు వెళ్లాలన్నా… ఆ భవనం కట్టింది కూడా చంద్రబాబే అన్నారు.
సాధారణంగా ఏ నాయకుడు అయినా మరొకరిని సూటిగా కళ్లలోకి చూస్తారని, జగన్ మాత్రం కాళ్ల వైపు చూస్తాడని, తాను వచ్చే ఎన్నికల్లో గెలవలేనని వైసీపీ అధినేతకు అర్థమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ పని అయిపోయింది… అని స్వయంగా ముఖ్యమంత్రికే అర్థమైందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయ ఉద్యోగాలు తీసేస్తారనే ప్రచారం సాగుతోందని, కానీ అవి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. కానీ గ్రామ సచివాలయాన్ని సిస్టమెటిక్‌గా చేయాల్సి ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మీసేవను చంపేశారని, అలా అని ప్రత్యామ్నాయం ఉందా అంటే అది లేదన్నారు.
ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ పేట ఎన్టీఆర్ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదంటూ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో 1 ప్రకారం రోడ్లపై సమావేసానికి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అనంతరం ఎన్టీఆర్ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. సభకు అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలని, తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టాలా అని నిలదీసారు. ఈ క్రమంలో పోలీసులు లోకేష్ చేతిలోని మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది.