»Alert Closure Of Parks In The Vicinity Of Hyderabad New Secretariat Traffic Restrictions Also
Alert: సచివాలయం పరిసరాల్లో పార్కుల మూసివేత.. ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన కొత్త సచివాలయం పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ప్రకటించింది.
నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని పార్కులను ఏప్రిల్ 30న(ఆదివారం) మూసివేయనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ప్రకటించింది. మధ్యాహ్నం 1:10 నుంచి 1:20 గంటల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొత్త సచివాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ క్రమంలో కొత్త సచివాలయం పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండనుంది.
దీంతో ఆదివారం లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ(HMDA) ప్రకటించింది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్(cm kcr) 6వ అంతస్తులోని తన ఛాంబర్లో కూర్చొనున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంఓ, సచివాలయ సిబ్బంది తమ ఛాంబర్లో కుర్చీలు వేసుకుని విధులు నిర్వర్తించనున్నారు.
మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం పీవి విగ్రహం – నెక్లెస్ రోటరీ – ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యే వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు(traffic restrictions) విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంకోవైపు సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చే వారి కోసం పార్కింగ్ ప్లేస్ అందుబాటులో ఉంటుందని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఆహ్వానితులు తమ వాహనాల పాస్ లను చూపించాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.