ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ, ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. ఐబీఎం కంపెనీ తన సిబ్బందిలో 3900 మందిని తీసేస్తున్నట్లు ప్రకటించింది.
కంపెనీ వార్షిక ఆదాయ లక్ష్యాలు తగ్గడంతోపాటు కొన్ని అసెట్ డివెస్ట్మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఐబీఎం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటి వరకూ అమెజాన్ 18 వేల మందిని, మెటా 11 వేలు, గూగుల్ 12 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.