అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ కమిషనర్ పి. రమణారెడ్డి వార్డు సచివాలయాలను పరిశీలించారు. 2026–27 సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.’మన మిత్ర’ ట్రైనింగ్ మాడ్యూల్‌ను ఫీల్డ్‌లోనే పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని చెప్పారు. UFS మిస్సింగ్, e-KYC డేటాలో జిల్లా వెనుకబడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
KRNL: జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మహమ్మద్ అజామ్ శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అభినందనలు తెలిపి, న్యాయవ్యవస్థలో నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. కృషి, పట్టుదలతో సాధించిన విజయాన్ని ప్రశంసించారు. కాగా, తండ్రి పోలీస్ శాఖలో సేవలందిస్తుండగా కుమారుడు న్యాయరంగంలో రాణించడం గర్వకారణమని ఎస్పీ కొనియాడారు.
NDL: నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏబిఎం చర్చి దగ్గర ప్రమాదవశాత్తు బస్సు ఎక్కుతూ వెనక టైర్ కిందపడి సయ్యద్ యూసుఫ్ (63)మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఎస్సై మణికంఠ తెలిపడంతో.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
AKP: మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్ధులు లిఖిత, జ్యోతి, కార్తీక్, కోమల్ అండర్-14 బేస్ బాల్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మే నెల ఐదో తారీకు నుంచి కర్నూలులో మొదలు కాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. పాఠశాల హెచ్ఎం మహాలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ రాజబాబు అభినందించారు.
ELR: వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం ఎంతో అవసరమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలె అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో ఉద్ధరాజరామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. సాగులో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు.
NDL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని శనివారం రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అటు, ఈవో శ్రీనివాసరావు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
KDP: డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో శనివారం సెమినార్ నిర్వహించారు. ఫ్రేమ్ ఇమేజినేషన్ టు క్రియేషన్‌పై జరిగిన సెమినార్‌కు ఛాన్సులర్ ప్రొ. విజయరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కళలు, గేమింగ్ రంగాలలో కృత్రిమ మేధస్సు గురించి వివరించారు. ఈ సెమినార్ కళలు, సాంకేతిక రంగానికి ఒక గొప్ప వేదికగా నిలిచిందన్నారు.
KRNL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘కిశోరి వికాసం-2026 వేసవి సెలవుల కార్యక్రమాలు’పై శనివారం జిల్లా కలెక్టర్ ఏ.సిరి రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించారు. కిశోరుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల పెంపు దిశగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ATP: జనగణనలో స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం అనంతపురంలో ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉ. 6:30 గంటలకు ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమయ్యే ఈ పరుగు టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి కళాశాల వద్దే ముగుస్తుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
E.G: రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం వెలుగు (సెర్ప్) కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో VOAలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు చెందిన మొత్తం 189 మంది VOAలకు మొబైల్స్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాల సేవలు అభినందనీయమని, డిజిటల్ సేవలతో గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.
కృష్ణా: పెనమలూరు (M) పోరంకి తన కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, మండల పరిషత్ అధికారులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను, నీటి పన్ను వ్యాపారాల సముదాయాల ద్వారా పన్నుల వసూలు విషయంలో నిక్కచ్చిగా ఉంటూ, ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అధికారులు, కూటమి నేతల భాగస్వామ్యంతో ప్రజాసేవలో పూర్తి బాధ్యతగా ఉండాలని తెలిపారు.
PLD: మాచర్ల మండలం కంభంపాడు గ్రామ సమీపంలో శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాచర్ల నుంచి పాల్వాయి జంక్షన్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని యువకుడిని అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NTR: తిరువూరు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో శనివారం నిర్వహించిన AP POLYCET–2026 ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ కేంద్రంలో పరీక్ష రాసేందుకు మొత్తం 821 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 750 మంది (91.3%) విద్యార్థులు హాజరయ్యారు. 71 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్ బాబురావు తెలిపారు.
అన్నమయ్య: పీలేరు నియోజకవర్గంలోని గుండబోయినపల్లి టోల్గేట్ వద్ద మహిళా ఉద్యోగిపై జరిగిన దాడిని CPI పీలేరు కార్యదర్శి వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అనుచరులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల దిగజార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని,బాధితురాలికి రక్షణ, న్యాయ సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ELR: నరసాపురం గ్రంథాలయంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు లైబ్రేరియన్ కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గం. వరకు ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.