VSP: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు.
NLR: ఉదయగిరి మండల పరిధిలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామ ఎస్టీలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నివేశిత (ఇంటి) స్థలాలు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. 32 మంది ఎస్టీలకు నివేశిత స్థలాల పట్టాలతో పాటు ఆయన ట్రస్టు ద్వారా మహిళ లబ్ధిదారులకు చీరలు అందజేశారు. అనంతరం బిజ్జంపల్లిలో రూ.46.80 లక్షలతో సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.
W.G: దుంపగడప వీ.వీ. గిరి ప్రభుత్వ కళాశాలలో డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టీ. నాగేశ్వరావు అధ్యక్షత వహించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలను వివరించారు. ముఖ్యవక్తగా యూ. శ్రీనివాసరావు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను తెలియజేశారు. అనంతరం విగ్రహానికి నివాళులు అర్పించారు.
NDL: పగిడ్యాల మండలం ఎం. గణపురం గ్రామానికి చెందిన వడ్డె మద్దిలేటి (65) వడదెబ్బతో మృతి చెందారు. ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
VSP: మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నాయకత్వంలో ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా రిజర్వేషన్‌పై నిపుణుల చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవసరమని, మహిళలకు నిర్ణయాధికారం పెరగాలని పేర్కొన్నారు.
విజయనగరం ఘోష ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకుని బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్, మాతృభూమి సేవా సంఘం మానవీయత చాటుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది గర్భిణీలు, బాలింతలకు బిస్కట్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి బాజ్జీ, భోగవిల్లి వెంకట రమణ పాల్గొన్నారు.
PPM: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మే 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం జరగనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా దేశంలో తొలిసారిగా డిజిటల్ మోడ్‌లో ఈ నెల 16 నుంచి 30 వరకు se.census.gov.in పోర్టల్ నందు వ్యక్తిగతంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.
SKLM: పలాస మండలం మహాదేవిపురంలో విషాదం చోటుచేసుకుంది. జంట హత్యల కేసులో నిందితుడైన మడియా రామారావు (45) తన నివాసంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోంపేట మండలం పాలవలస, మందస మండలం దున్నవూరులలో జరిగిన జంట హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: నక్కపల్లి మండల కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలమంచిలి బైపాస్ నుంచి నక్కపల్లి మీదుగా పాయకరావుపేట తాండవ వంతెన వరకు జాతీయ రహదారిపై నిరంతరం జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. రహదారి నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు.
VZM: ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను మంగళవారం పరిశీలించారు. కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేపించాలని సిబ్బందికి సూచించారు. పనుల వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, కొలతలు ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు.
KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలోని క్యాంపు కార్యాలయంలో అన్నవరం సత్యదేవుని దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి (EO)గా బాధ్యతలు స్వీకరించిన నల్లం సూర్య చక్రరావు ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
CTR: పలమనేరు గంటావూరు చెరువులో మట్టి అక్రమాలపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే పోలీస్, ఇరిగేషన్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుతో పాటు స్మశానంలో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు కూడా మాఫియాను అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
బాపట్ల జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. “శిరో రక్షా–ప్రాణ రక్షా” నినాదంతో హెల్మెట్ వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుందని, ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
NDL: చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం ఐదేళ్లుగా పూర్తికాక రైతులకు అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వంలో రూ.12 లక్షలతో ప్రారంభించిన పనులు నిధుల కొరత, ప్రభుత్వం మార్పుతో నిలిచిపోయాయి. దీంతో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
BPT: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ (IPS) పర్యవేక్షణలో మంగళవారం పలు జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ రైడ్లలో పలువురు జూదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.