• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సమన్వయం చాలా కీలకం: కమిషనర్

GNTR: రాష్ట్ర రాజధానిలోని SRM యూనివర్సిటీలో మంగళవారం జరగనున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం ఆయన SRM తదితర ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

April 13, 2026 / 12:25 PM IST

PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: కలెక్టర్

NDL: నంద్యాల కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ జి.రాజకుమారి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.

April 13, 2026 / 12:18 PM IST

కంభంలో ఉపాధి హామీ పనుల పరిశీలన

ప్రకాశం: కంభం పట్టణంలోని ఉపాధి హామీ (MGNREGS) పనులను ఎంపీడీఓ వీరభద్రచారి సోమవారం ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. అలాగే కూలీలతో మాట్లాడి, హాజరు నమోదు విధానం,  పనుల అమలు తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా, సమయానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

April 13, 2026 / 12:16 PM IST

వనరులు లేకపోయినా విశాఖ జట్టు మెరుపు ప్రదర్శన

VSP: రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం సాధించింది. పరిమిత వనరులు, సరైన ప్రాక్టీస్ లేకపోయినా సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి ప్రతిభ చూపింది. కోచ్ వి. దాసారావు మాట్లాడుతూ.. సరైన సదుపాయాలు కల్పిస్తే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు.

April 13, 2026 / 12:15 PM IST

ఈ నెల 21 నుంచి చౌడేపల్లెలో బ్రహ్మోత్సవాలు

CTR: చౌడేపల్లెలోని ప్రసిద్ధ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 27న స్వామివారి కళ్యాణోత్సవం, 28న రథోత్సవం నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.

April 13, 2026 / 12:04 PM IST

జీవీపీ పాయింట్ల తొలగింపుకు ప్రత్యేక చర్యలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేశ్ చంద్ర 12వ డివిజన్‌లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. జీవీపీ పాయింట్ల తొలగింపుకు చర్యలు తీసుకుని, క్లాప్ ఆటోల ద్వారా చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక డ్రైవ్‌తో ప్రాంతాన్ని శుభ్రపరచి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.

April 13, 2026 / 12:02 PM IST

రేపటి నుంచి అగ్నిమాపక సేవల వారోత్సవాలు

PPM: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన కేంద్రాల పరిధిలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందచామని, పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

April 13, 2026 / 11:33 AM IST

గుండవోలులో విద్యుత్ వైర్ల మార్పు

NLR: రాపూరు మండలం గుండవోలులో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. విద్యుత్ వైర్లు ఇళ్లకు అతి సమీపంలో ఉన్నందున వాటిని ఇళ్లకు దూరంగా మార్చారు. చెప్పిన వెంటనే చర్యలు తీసుకోవడంతో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

April 13, 2026 / 11:30 AM IST

గూడూరు పట్టణంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

TPT: గూడూరు పట్టణం బనిగి సాహెబ్ పేటలో సోమవారం గూడూరు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 10 మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీల్లో గూడూరు ఒకటో పట్టణ, రెండో పట్టణ సీఐలు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:29 AM IST

ఆటో బోల్తా.. 7 మందికి గాయాలు

ATP: గుత్తి మండలం నాగసముద్రం క్రాస్ వద్ద సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని జిల్లా కేంద్రానికి తరలించారు. గుత్తి నుంచి అబ్బే దొడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

April 13, 2026 / 11:21 AM IST

నేషనల్ హైవే-216పై పాల వ్యాన్ పల్టీ

కృష్ణా: జాతీయ రహదారిపై పాల వ్యాన్ ప్రమాదానికి గురైంది. సోమవారం కృష్ణా మిల్క్ యూనియన్ పాల వ్యాన్ చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరంలో జాతీయ రహదారి-216పై పల్టీ కొట్టింది. ఉదయం నాగాయలంకలో పాల ప్యాకెట్లు సరఫరా చేసి తిరిగి మచిలీపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

April 13, 2026 / 11:20 AM IST

ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామములో రావి శ్రీలలిత మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇవాళ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని నిర్వహణ కొరకు పాఠశాల సిబ్బందిలో ఒకరిని నియమించాలన్నారు.

April 13, 2026 / 11:19 AM IST

‘అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా’

VZM: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాతో నిఘా పెడతామని బొబ్బిలి CI కె. నారాయణరావు తెలిపారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సోమవారం డ్రోన్‌ కెమెరా ఎగర వేశారు. అనంతరం మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన వారిని పట్టుకునేందుకు, పేకాట ఆడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్‌ కెమెరాతో నిఘా పెడతామన్నారు.

April 13, 2026 / 11:19 AM IST

త్వరలో వందేభారత్ రైలు: కేంద్ర మంత్రి

W.G: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ​వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంకు మరో 15రోజుల్లో వస్తుందని కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే అధికారులకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వీడియో షేర్ చేసినట్లు వెల్లడించారు.

April 13, 2026 / 11:15 AM IST

ఉపాధి పథకం పనులు పునఃప్రారంభం

AKP: అచ్యుతాపురం మండలం జగ్గయ్యపేటలో సోమవారం ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఏపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు పంట కాలవల మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 200 మంది వేతన దారులు పనులకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆడారి సాంబశివరావు, ఎం. రమణబాబు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:15 AM IST