• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘తాళ్లకోడులో మౌలిక సదుపాయాలు కల్పించాలి’

W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడు విచ్చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిటి నాయుడు, రవితేజ, వల్లి ఉన్నారు.

April 14, 2026 / 09:29 AM IST

బాలిక మృతిపై విచారణకు త్రిసభ్య కమిటీ

AKP: అచ్యుతాపురం కేజీబీవీలో బాలిక మృతి చెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. కమిటీలో ఎలమంచిలి, కె. కోటపాడు ఎంఈఓలు సూర్యప్రకాష్, ప్రసాద్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని జెనీమా ఉన్నట్లు తెలిపారు.

April 14, 2026 / 09:28 AM IST

మరో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

April 14, 2026 / 09:10 AM IST

9 మండలాలకు ఒకటే అగ్నిమాపక శకటం

AKP: నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో 9 మండలాలకు సేవలు అందుతున్నాయి. 1982 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక శకటం ద్వారా అనకాపల్లి జిల్లాలో ఆరు మండలాలు, అల్లూరు జిల్లాలో మూడు మండలాలకు ఆపద సమయంలో సేవలందిస్తున్నారు. అయితే మరో అగ్నిమాపక శకటం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

April 14, 2026 / 09:01 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన అధికారులు

KRNL: ఎమ్మిగనూరు సమీపంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష సమక్షంలో వసతులు, రికార్డులు, బోధన విధానాలు పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు సిబ్బందిని అభినందించారు. ఇందులో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 08:50 AM IST

కేసును చేధించిన పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ

ప్రకాశం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

April 14, 2026 / 08:50 AM IST

నేడు రేపల్లెకు MLA రాక..!

NDL: బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామానికి ఇవాళ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలిపారు. ముందుగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కోట్ల పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం రేపల్లె గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీలకు వంద శాతం ఉచిత సౌర విద్యుత్ ఏర్పాట్లను ప్రారంభిస్తారన్నారు.

April 14, 2026 / 08:49 AM IST

‘బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి’

AKP: మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తూ మృతి చెందిన వేతన దారుడు రాము కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపాధ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

April 14, 2026 / 08:42 AM IST

మందస దాడి కేసులో ముద్దాయికి శిక్ష

SKLM: మందస మండలం ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ సోంపేట జూని యర్ సివిల్ జడ్జి కె. శ్రీనివాసరావు తీర్పు ఇచ్చారని మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సరియా పల్లి ఉపాధ్యాయుడు (2020లో) మెట్ట దామోదరరావుతో అదే గ్రామానికి చెందిన గస్యా శ్రీనివాసరావు ‘నాడు-నేడు’ పనుల బిల్లుల విషయమై గొడవపడ్డారు.

April 14, 2026 / 08:41 AM IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

PLD: అమరావతి మద్దూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రోడ్డులో సీఎం హెలిప్యాడ్ కోసం పరిసరాలను శుభ్రం చేసి, రహదారులను సిద్ధం చేశారు. కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి, భద్రత, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

April 14, 2026 / 08:40 AM IST

రాయదుర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.30 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32వ వార్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో రూ.30.65 లక్షలతో సీసీ రోడ్డు పనులను మొదలుపెట్టామన్నారు.

April 14, 2026 / 08:39 AM IST

‘క్షేత్రస్థాయిలో పనులు గుర్తించాలి’

PPM: జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార’ కార్యక్రమంపై కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జలధార ప్రోగ్రాంకు సంబంధించిన జీవో నంబర్ 10 ప్రకారం మొదటి దశలో 10 రోజుల్లో జూన్ 6 నుంచి 15 తేదీ వరకు క్షేత్రస్థాయిలో పనులను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 

April 14, 2026 / 08:38 AM IST

మహిళా కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే

E.G: అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చౌట జయలక్ష్మికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి ఆర్థిక సాయం అందించారు. ఆమె మోకాళ్ల సర్జరీ కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సోమవారం సూచించారు. తక్షణ ఖర్చుల కోసం రూ.10,000 అందజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.

April 14, 2026 / 08:38 AM IST

‘దండోరా ద్వారా గ్రామసభల తేదీలు తెలియజేస్తాం’

VZM: గంట్యాడ మండల పరిధిలో ఈ నెల 16 నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు స్దానిక MPDO రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగుతాయన్నారు. ఏ గ్రామంలో ఏ తేదీన గ్రామసభ జరుగుతుందన్న విషయమై ముందుగా గ్రామాల్లో దండోరా ద్వారా ప్రజలకు తెలియజేస్తారన్నారు.

April 14, 2026 / 08:33 AM IST

గ్రామాల్లో భద్రతపై పోలీసుల అవగాహన సదస్సులు

సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ అధికారులు సభలు ఏర్పాటు చేసి మహిళా భద్రత, మాదక ద్రవ్యాల అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై వివరిస్తూ కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

April 14, 2026 / 08:31 AM IST