SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
KRNL: చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించరని ఇవాళ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ‘MAVIGUN’తో కేవలం రూ.10-20వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
PPM: సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. SEWA (షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PLD: అమరావతి మండలం ధరణికోటలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీతో లబ్దిదాదులు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతంరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
ELR: విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీవరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని వీఆర్‌కు పంపిన ఎస్పీ, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ బ్రహ్మరాజు, సర్పంచ్ విక్టర్ బాబు, బోయపాటి పెద్దబుజ్జి, నీకెళ్లి గణేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ఆయన కన్న కలలను సాకారం చేయాలని బ్రహ్మరాజు పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ సేవలను స్మరిస్తూ పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.
TPT: జిల్లాలో ఇంటర్ తరగతులు ప్రారంభమై 15 రోజులు గడిచినా పుస్తకాలు అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు స్పందించారు. నూతన సిలబస్ పుస్తకాలను RIO కార్యాలయానికి చేరవేశారు. బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు RIO రాజశేఖర్ తెలిపారు. త్వరలోనే అందరికీ పుస్తకాలు అందుతాయని ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి మండలంలో శంఖవరంకు చెందిన తమ్మిశెట్టి పద్మ మంగళవారం ఎలుకలు మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కాగా తనకు పిల్లలు లేరని, అనారోగ్య కారణాలు ఉన్నాయని మానసికంగా కుంగిపోయి, మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
W.G: భీమవరం, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి డీఎస్పీ రఘువీర్ విష్ణు పుష్పమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయవాది, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యాలయంలో డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
GNTR: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.
NDL: బేతంచెర్ల మండలంలో రేపటి నుంచి 30 వరకు నిర్వహించే జనాభా గణనకు ప్రజలు సహకరించాలని మంగళవారం తహసీల్దార్ నాగమణి కోరారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వివరాలు అందజేయాలని చెప్పుకొచ్చారు. సందేహాల నివారణకు 1885 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.
VSP: జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, https://se.census.gov.in ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
కృష్ణా: రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని డా. బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజా వేదికలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సందర్బంగా ఎమ్మెల్యే అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందు సాగుతుందన్నారు.
SS: ధర్మవరం నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ 2000 సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు రవాణా ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా సైకిల్ తొక్కి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
AKP: పాయకరావుపేట గ్రామసభను స్థానిక పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లవరాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే, ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. అలాగే, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.