SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో రూ.25 లక్షల సొంత నిధులతో పాఠశాల భోజనశాల నిర్మించారు. కొంచాడ గోవిందరావు, సుకన్య దంపతుల దాతృత్వంతో ఈ భోజనశాల నిర్మించి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పాల్గొన్నారు.
VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదివారం బొబ్బిలి PS, రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసు స్టేషన్, సర్కిల్ ఆఫీసు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ను సందర్శించారు. ప్రమాద కారణాలను అన్వేషించి, రహదారి ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
NDL: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలయాల అభివృద్ధిపై YCP నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పనులు చేయడం వల్లే దేవుడు వారిపై ఆగ్రహించారని.. అందుకే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొపెట్టారని ఆరోపించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
NDL: ఆళ్లగడ్డలోని ఆస్తి విషయంలో అన్నను తమ్ముడు హతమార్చిన సంఘటన ఆర్.కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇవాళ మాటల తగాదా ఘర్షణగా మారి తమ్ముడు విజయరాజు ఆవేశంతో రోకలిబండతో అన్న దైవభక్తుడు (40)పై దాడి చేశాడు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా దైవ భక్తుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఐపీఎల్ వేళ ఆన్లైన్ బెట్టింగ్‌లు, జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఐపీఎల్ సీజన్ సమయంలో కొంతమంది యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్‌ల వైపు వెళ్తున్నారని పేర్కొన్నారు.
GNTR: పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు నుంచి చిన్నారి దిగుతుండగా ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం చెందింది.
NTR: తిరువూరులో కుమ్మరి బజార్‌లో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తూ.గో జిల్లా ఏడిద గ్రామానికి చెందిన నేరస్థుడు కందుల సత్యనారాయణను అరెస్ట్ చేశారు. సీఐ కే. గిరిబాబు నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ముద్దాయి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, 2116 కేజీల వెండి, రూ.10 వేల నగదు, ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
NDL: గడివేములకు చెందిన భారతి ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో సత్తా చాటింది. HYDలో చదువుతూ MPCలో 470 మార్కులకు గాను, 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి వరకు గడివేములలోనే చదివింది. గతేడాది పదో తరగతిలో ఫలితాలలోనూ 600కు 587 మార్కులు పొంది మండల టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినిందించారు.
BPT: చాట్రాసి ఫౌండేషన్ చీరాల నియోజకవర్గంలోని ఆమోదగిరిపట్నం పరిధికి చెందిన యువతకు వాలీబాల్ కిట్‌ను పంపిణీ చేశారు. యువత అభ్యర్థనపై రామకృష్ణపురం క్యాంప్ కార్యాలయంలో ఫౌండేషన్ ఛైర్మన్ చాట్రాసి రాజేష్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పుడైనా అవసరమైతే.. సహాయం కోసం తనను సంప్రదించాలని సూచించారు.
ATP: కళ్యాణదుర్గంలో MLA అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో జరుగుతున్న విగ్రహాల ఏర్పాటు పనులను టీడీపీ నాయకుడు దేవినేని నవీన్ ఆదివారం పరిశీలించారు. వాల్మీకి సర్కిల్‌లో రూ. 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్న మహర్షి వాల్మీకి కాంస్య విగ్రహ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటు స్థలాలను పరిశీలించారు.
కోనసీమ: జిల్లా పరిధిలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో అక్రమ బెట్టింగ్ కు కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, అనధికారిక యాప్‌ల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
తిరుపతి జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో ఒక స్లీపర్ బస్సు స్వాధీనం చేసుకుని, 40 వాహనాలపై కేసులు నమోదు చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, ప్రజలు, వాహన యజమానులు రవాణా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ కోరింది.
కర్నూలు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అన్నమయ్య: ఈ నెల 13న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు 9440817449 ఈ నెంబరుకు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ELR: ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వెట్టి భారతి, కే. లతలు ఎన్నికైనట్లు తెలిపారు. ఆదివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న మెమోరియల్ హాల్‌లో POW జిల్లా నూతన కార్యవర్గాన్ని 15 మందితో ఎన్నుకున్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నిషేధించాలని, మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ నిర్భయ చట్టాలను అమలు చేయాలన్నారు.