వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (ys vivekananda murder case) కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని (kadapa mp, ycp leader avinash reddy) విచారణ సంస్థ సీబీఐ (cbi) బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం పదిన్నర గంటల సమయానికి ఆయన సీబీఐ కార్యాలయానికి వచ్చారు. దాదాపు రాత్రి ఏడు గంటల సమయంలో విచారణ పూర్తయింది. రేపు ఉదయం కూడా పదిన్నర గంటలకు రావాలని సీబీఐ పిలిచింది. వివేకా హత్య కేసులోనే అరెస్ట్ అయిన వైయస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు. వీరిద్దర్ని దాదాపు ఐదున్నర గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్యకు దారి తీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపై విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.
కాగా, వైయస్ అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పైన నిన్న న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. అప్పటి వరకు ప్రతి రోజు విచారణకు హాజరవ కావాలని అవినాశ్ రెడ్డిని కూడా ఆదేశించింది.