మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐ ఎదుట విచారణకు హాజరు అయ్యేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం గం.3 కు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో పులివెందుల్లో తన నివాసం నుండి తెల్లవారుజామునే హైదరాబాద్కు బయలు దేరారు. పలు వాహనాల్లో అనుచరులతో కలసి బయలుదేరారు. సీబీఐ జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 తేదీలలో విచారించింది. అతన్ని ఐదో సారి నేడు విచారించనుంది. అవినాష్ విచారణ సమయంలో గతంలో మాదిరిగానే అధికారులు వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు.
ఈ కేసులో సీబీఐ ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ అతన్ని చంచల్గూడ జైలుకు తరలించింది. అంతకుముందు ఏడు గంటల వరకు భాస్కర్ రెడ్డిని విచారించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మెమో జారీ చేశారు.