వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్యింది. దీంతో… వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లభించలేదు. బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండటంతో.. ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. ఫలితం లేకపోయింది.
భగీరథ రెడ్డికి వెంటిలేటర్‌పై మొదట 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని.. ఆ తర్వాత 60 శాతానికి తగ్గించారని కుటుంబసభ్యులు వివరించారు. శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారని చెప్పారు. కానీ.. అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది.