బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన్స్టాపబుల్ నుండి ఆహ్వానం అందినప్పటికీ, చంద్రబాబు, ఆ తర్వాత పవన్ వెళ్లారని అందుకే తాను దూరం జరిగినట్లు వెల్లడించారు.
ముప్పై ఏళ్లుగా ఏ కాంగ్రెస్ కరెక్ట్ కాదని చెప్పారో, ఇప్పుడు చంద్రబాబు అదే పార్టీతో అంటకాగుతున్నారని, మోడీని తిడుతూ, బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబులు కూడా పరస్పరం విమర్శలు చేసుకొని, ఇప్పుడు కలవడమేమిటన్నారు. వారికి నీతి, నిజాయితీ లేదన్నారు. రాజకీయ అజ్ఞానాలు, జోకర్లు మాట్లాడితే తాను పట్టించుకోనన్నారు.
మెగా సోదరులపై కూడా విమర్శలు గుప్పించారు రోజా. కోట శ్రీనివాస రావు, బాబుమోహన్ వంటి వారు కూడా గెలిచినప్పుడు మెగా సోదరులు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వారికి రాజకీయాల్లో ప్రజామోదం లేదన్నారు. ఇండస్ట్రీలోను వారిని చూసి భయమే తప్ప, ప్రేమ కాదన్నారు. మెగా సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిశ్రమకు దూరం చేస్తారనే భయంతో చాలామంది వారికి అనుకూలంగా ఉంటారని, కానీ ప్రేమతో కాదన్నారు. అదే నిజమైతే ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.
సంక్రాంతి సంబరాల ముగింపు సందర్భంగా మంగళవారం మరోసారి మాట్లాడిన రోజు నేతల పాదయాత్రలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వారాహితో వచ్చినా, లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పాదయాత్రలు చేస్తే బరువు తగ్గడం తప్ప మరో ప్రయోజనం అయితే లేదన్నారు.