»Vaikunta Dwara Darshan For December 23 To January 1st 2023 Ttd Orders
TTD: డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వారా దర్శనం..టీటీడీ కీలక ఆదేశాలు
తిరుమలలో మరికొన్ని రోజుల్లో వైకంఠ ద్వార దర్శనం మొదలయ్యి 10 రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులపాటు వీఐపీ దర్శనాలు ఉండబోవని స్పష్టం చేశారు. అంతేకాదు సిఫారసు లేఖలు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు.
Vaikunta dwara darshan for December 23 to january 1st 2023 TTD orders
తిరుమల(tirumala) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం వైకుంఠ ద్వారం తెరిచి ఉంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ దర్శనం విశిష్టమైనది. వైకుంఠంలో విష్ణుమూర్తికి ఒక రోజు అంటే భూమిపై ఒక సంవత్సరం. అదే విధంగా, అక్కడ రోజులు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు 6 నెలలు దక్షిణాయనంగా ఉంటాయి.
వైకుంఠంలో 120 నిమిషాల తెల్లవారుజాము భూమిపై 30 రోజులకు సమానం. దీనినే ధనుర్మాసం అంటాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం 40 నిమిషాలకు విష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తాడు. ఇది ఆ కాలాన్ని బట్టి వైకుంఠంలో నిత్యం జరిగే ప్రక్రియ. ఇది భూమి సమయం ప్రకారం సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూమిపై ఉన్న 10 రోజులతో సమానం కాబట్టి, వైష్ణవ ఆలయాల్లో ఈ 10 రోజులు వైకుంఠాన్ని దర్శిస్తే, నేరుగా విష్ణుమూర్తి దర్శన భాగ్యం కలుగుతుందని నమ్మకం.
10 రోజులలో ఏ రోజైనా వైకుంఠ దర్శనం సమానమని టీటీడీ(TTD) చెబుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి తరలిరావాలని కోరారు. తిరుమలలో గదులు తక్కువగా ఉన్నందున, ఈ రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాలని భక్తులకు సూచించారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వతహాగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు బ్రేక్ దర్శనానికి పరిమితమైన అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబోమని తెలిపారు.
10 రోజుల పాటు వైకుంఠ దర్శనానికి ఫలితం ఉంటుందని టీటీడీ గుర్తు చేసింది. కావున వీఐపీలు, ఇతర భక్తులు ఎలాంటి హడావిడి లేకుండా తొలిరోజు వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే దర్శనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, పదిరోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ఈ నెల 22 నుంచి తిరుమల, తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్లైన్ టిక్కెట్లను జారీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం 10 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 94 కౌంటర్లలో మొత్తం 4,23,500 టోకెన్లు జారీ చేయనున్నారు.
తిరుమలలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదాన్, రామచంద్ర పుష్కరిణి, శ్రీ గోవిందరాజస్వామి రెండవ సత్రం, భైరాగిపట్టెడలోని ఎంఆర్ పల్లి హైస్కూల్, రామానాయుడు హైస్కూల్, జీవకోన హైస్కూల్, కౌస్తుభం రెస్ట్ హౌస్లో ఈ టిక్కెట్లను జారీ చేస్తారు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి దర్శనాల సమయంలో టిక్కెట్టు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.