Tirumala Tirupati : ఎస్ఎంఎస్ పే సిస్టమ్‌ను తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనం టికెట్ల జారీలో కొత్తగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి శ్రీ వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకుని వస్తూ ఉంటుంది. అందులో భాగంగా బ్రేక్ దర్శనం టికెట్లను పొందేందుకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని తాజాగా తీసుకుని వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను తాజాగా విడుదల చేసింది.
ఈ ఎస్ఎంఎస్ పే విధానం (sms pay system ) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఈ విధానంలో ముందుగా వారు ఎస్ఎంఎస్ ద్వారా పే లింకును మన మొబైల్‌కి పంపిస్తారు. ఆ లింక్‌పైన క్లిక్ చేస్తే యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఆన్లైన్లో డబ్బులు చెల్లించవచ్చు. ఎంబీసీ 34 కౌంటర్ వద్దకు వెళ్లక్కర్లేకుండా బ్రేక్ దర్శనం టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవల్లో మాత్రమే ఈ ఎస్ఎంఎస్ పే సిస్టమ్‌ని అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ నెల 16న సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథ సప్తమి పర్వదినాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.