తిరుమల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొత్త సంవత్సరంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్లు హుండీలో చేరడం గమనార్హం. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇక సోమవారం 69వేల 414మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 18,612మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గతేడాది అక్టోబర్ 23న అత్యధికంగా రూ.6.31 కోట్లు వచ్చింది. అలాగే ఏప్రిల్ 7న రూ.6.18 కోట్లు, 2018లో ఒక రోజు రూ.6.28 కోట్ల రాబడి వచ్చింది. ఇప్పుడు రూ.7.68 కోట్లతో ఆదాయంతో సరికొత్త రికార్డు నమోదైంది. ఇదిలా ఉంటే 2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. దీంతో కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నారు. సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.