»The Staff Of The Government Hospital Who Did Not Have An Ambulance Went Home With His Sons Body On A Bike
Andhrapradesh: అంబులెన్స్ లేదన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది.. బైక్‌పై కొడుకు మృతదేహంతో ఇంటికి!
ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వారు బైక్‌పై ఇంటికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విష జ్వరాల వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జ్వరాల బారిన పడి ఇప్పటికే కొందరు మృతిచెందారు. పలుచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ప్రవర్తించే తీరు రోగులను ఆందోళనకు గురిచేస్తోంది. చాలాచోట్ల డెంగ్యూతో ఆస్పత్రికి వెళితే అక్కడున్న సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అంబులెన్సులు ఉన్నప్పటికీ వాటిని ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్న తీరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొంది. తాజాగా ఇటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందితే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదన్నారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. ఈ అమానుష ఘటన శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, అమలాపురంలోని హనుమంతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాధమ్మ, పాత లింగప్పల 5 ఏళ్ల కొడుకు రుషి డెంగ్యూ ఫీవర్‌తో మృతిచెందాడు.
మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రుషి మృతిచెందడంతో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు. అయితే అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక రుషి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బైక్‌పై గ్రామానికి తీసుకెళ్లారు.
బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. కొడుకు డెడ్‌బాడీని బైక్‌పై తరలిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారని, తమ కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.