»Tdp Chief Chandrababu Naidu Likely To Start Districts Tour From December 10th
Chandrababu Naidu: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల్లో పర్యటన!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వనున్నారు.
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వనున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో ఈ సభలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఓటరు జాబితాలో వైఎస్సార్సీపీ చేసిన అక్రమాలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందుకు సమయం ఇవ్వాలని సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. ఆదివారం సింహాచలం అప్పన్నను, ఈ నెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ దర్గా, విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాలను సందర్శిస్తారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని నారా చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కేంద్రం పథకాలకు పుష్కలంగా నిధులు ఇస్తుందని, కానీ నేడు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో అనేక పథకాలు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను, జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.